హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ నుంచి మరింత మంది యువ షూటర్లు వెలుగులోకి రావాలని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఏస్ షూటర్ గగన్ నారంగ్ నేతృత్వంలోని ‘గన్ ఫర్ గ్లోరీ(జీఎఫ్జీ)’ అకాడమీ బుధవారం ఏర్పాటు చేసిన చీర్ ఫర్ ఇండియా కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘రాష్ట్రం నుంచి నారంగ్ లాంటి షూటర్లు మరింత మంది వృద్ధిలోకి రావాలి. బ్యాడ్మింటన్‌కు హైదరాబాద్ ఎలాగైతే కేంద్రంగా మారిందో.. షూటింగ్‌కూ హబ్‌గా మారాలి. షూటింగ్ రేంజ్‌లను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది’ అని అన్నారు. జీఎఫ్జీ అకాడమీ అభివృద్ధికి సహకరించిన ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌కు ఈ సందర్భంగా నారంగ్ కృతజ్ఞతలు తెలిపాడు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రొఫెషనల్ షూటర్లా పలు రకాల గన్లతో లక్ష్యాన్ని గురిచూసి కొట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ కార్యక్రమంలో సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు.