హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రపంచ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో రెండు స్వర్ణాలు సాధించిన రాష్ట్ర యువ షూటర్ ఇషా సింగ్‌ను క్రీడాశాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో అభినందించారు. వచ్చే నెలలో చైనా వేదికగా జరుగనున్న ఆసియా క్రీడలకు ఇషా ఎంపికైన సందర్భంగా.. అందులోనూ సత్తాచాటి రాష్ర్టానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.
రాష్ట్రంలో 17 వేల గ్రామపంచాయతీల్లో గ్రామీణ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రతిభావంతులను ప్రోత్సహించడంలో తమ ప్రభుత్వం ముందుంటుందని అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న ఇషా సింగ్‌కు రూ. 2 కోట్లు ఇవ్వడమే దీనికి నిదర్శనమని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో ఇషా సింగ్ కుటుంబ సభ్యులతో పాటు మహబూబ్‌నగర్‌కు చెందిన పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.