రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తున్నది. ప్రతిభ కల్గిన ప్లేయర్లను ప్రోత్సహించేందుకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నది. మట్టిలో మాణిక్యాలను వెలికి తీసేందుకు ఇప్పటికే గ్రామగ్రామాన క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసింది. భవిష్యత్‌లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరింత మంది రాష్ట్రం తరఫున సత్తాచాటేలా పక్కా ప్రణాళికతో ముందుకెళుతున్నది. ఇందులో భాగంగా మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో సీఎం కప్ పేరిట ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా క్రీడా టోర్నీలు నిర్వహించబోతున్నది. ఈ నెల 15 నుంచి 31 వరకు జరిగే టోర్నీలో పోటీపడేందుకు యువతీయువకులు అత్యంత ఆసక్తి కనబరుస్తున్నారు. గ్రామాల్లో ప్రతిభకు కొదువలేదు. వెన్నుతట్టి ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు.
మెరికల్లాంటి ప్లేయర్లను గుర్తించి వారిని సానబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. క్రీడా ప్రాంగణాల ద్వారా ఇప్పటికే మౌలిక వసతులను అందుబాటులోకి తీసుకొచ్చిన ప్రభుత్వం సీఎం కప్ ద్వారా మరింత మందిని గుర్తించనుంది. ఇందుకోసం క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సీఎం కప్ ఏర్పాట్లను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్తో కలిసి ఆయా జిల్లాలకు చెందిన క్రీడాధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ నెల 15 నుంచి 31 వరకు మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో నిర్వహించే టోర్నీలకు సంబంధించిన సీఎం కప్ టోర్నీ ఫైల్‌పై మంత్రి శ్రీనివాస్‌గౌడ్ నూతన సచివాలయంలో తొలి సంతకం చేశారు. క్రీడాశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా టోర్నీ నిర్వహణ ఏర్పాట్లపై ఆయా జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు జారీచేశారు. ఈ టోర్నీలో 15 నుంచి 36 ఏండ్ల పురుషుల, మహిళలు పాల్గొనేందుకు అర్హులుగా ప్రకటించారు.
సీఎం కప్ టోర్నీలో భాగంగా ఈ నెల 15,16, 17 తేదీల్లో మూడు రోజుల పాటు మండల కేంద్రాల్లో క్రీడా టోర్నీలు నిర్వహిస్తారు. అథ్లెటిక్స్, ఫుట్‌బాల్(పురుషులు), కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ పోటీలు నిర్వహిస్తారు. మండల స్థాయిలో విజేతలుగా నిలిచిన జట్లతో పాటు వివిధ వ్యక్తిగత విభాగాల్లో చాంపియన్లను జిల్లా స్థాయికి ఎంపిక చేస్తారు. మండల స్థాయి టోర్నీల్లో ఎంపీపీ చైర్మన్‌గా, జెడ్పీటీసీ సభ్యునిగా ఉంటారు.
మొత్తం 11 క్రీడాంశాలతో జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహించనున్నారు. ఈ నెల 22 నుంచి 24 వరకు పోటీలు జరుగుతాయి. ఇందులో అథ్లెటిక్స్, ఫుట్‌బాల్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, బాక్సింగ్, హ్యాండ్‌బాల్, స్విమ్మింగ్, రెజ్లింగ్ ఉన్నాయి. జిల్లా స్థాయిలో కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరించనుండగా, ఎస్పీ వైస్ చైర్మన్‌గా ఉంటారు. ఆయా మండలాల్లో ప్రతిభ చాటిన ప్లేయర్లు, జట్లు జిల్లా టోర్నీల్లో బరిలోకి దిగుతాయి.
వివిధ జిల్లాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ప్లేయర్లు, జట్లు రాష్ట్ర స్థాయిలో పోటీపడుతాయి. ఈ నెల 28 నుంచి 31 వరకు మొత్తం 18 క్రీడా విభాగాల్లో టోర్నీలు జరుగుతాయి. కమిటీలో క్రీడాశాఖ మంత్రి చైర్మన్‌గా, సాట్స్ చైర్మన్ కో చైర్మన్‌గా, క్రీడాశాఖ ముఖ్య కార్యదర్శి వైస్ చైర్మన్‌గా, సాట్స్ వీసీ అండ్ ఎండీ కన్వీనర్‌గా ఉంటారు.
రాష్ట్ర స్థాయిలో వ్యక్తిగత విభాగంలో విజేతలుగా నిలిచే వారికి వరుసగా స్వర్ణం (20 వేలు), రజతం (15 వేలు), కాంస్యం (10 వేలు), టీమ్ ఈవెంట్లలో స్వర్ణం (లక్ష), రజతం (75 వేలు), కాంస్యం(50 వేలు) నగదు ప్రోత్సాహకం దక్కనుంది.
సీఎం కప్ టోర్నీలో క్రీడల నిర్వహణ కోసం ప్రతి మండలానికి రూ.15 వేలు, జిల్లాలకు రూ.75 వేలు కేటాయించారు. ఈ నిధులే కాకుండా స్థానికంగా స్పాన్సర్ల సహకారంతో నిర్వహించనున్నారు.
సీఎం కప్ టోర్నీని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నాం. గ్రామీణ ప్రాంత ప్లేయర్లను వెలుగులోకి తీసుకొచ్చే ముఖ్య ఉద్దేశంతో టోర్నీ ఏర్పాటు చేశాం. సీఎం కప్ సంబంధించి ఇప్పటికే జిల్లాల క్రీడాధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించాం. ఎక్కడా ఎలాంటి లోటు లేకుండా క్రీడల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించాం.
– శ్రీనివాస్‌గౌడ్, క్రీడా మంత్రి
రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కప్ టోర్నీని పండుగ వాతావరణంలో నిర్వహిస్తాం. టోర్నీలో పోటీపడేందుకు ప్లేయర్లు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటికే రెండు లక్షల మందికి పైగా ప్లేయర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ఇవి దోహదపడుతాయి
– ఆంజనేయగౌడ్, సాట్స్ చైర్మన్