హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ ఒలింపిక్ సంఘానికి అనుబంధంగా ఉన్న రాష్ట్రంలోని దాదాపు 50 అనుబంధ సంఘాలు భేటీ అయ్యాయి. గురువారం సాట్స్ ప్రధాన కార్యాలయంలో ఆయా క్రీడా సంఘాల ప్రతినిధులు సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. ముఖ్యంగా తమకున్న సమస్యలను సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. దీనికి తోడు టోర్నీల నిర్వహణకు ఎదురవుతున్న ఆర్థిక సమస్యలను వివరించారు. దీనిపై స్పందించిన సాట్స్ చైర్మన్.. సీఎం కేసీఆర్, క్రీడా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సహాయ, సహకారంతో ముందుకు వెళ్దామని పేర్కొన్నారు. టీవోఏ ఇంచార్జ్ అధ్యక్షుడు వేణుగోపాలచారి, కార్యదర్శి జగదీశ్‌యాదవ్, క్రీడాసంఘాల అధ్యక్ష, కార్యదర్శులు ఇందులో పాల్గొన్నారు.