Indian Womens Team | మాంచెస్టర్ : ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత మహిళల క్రికెట్ జట్టు కొత్త చరిత్ర సృష్టించింది. ఇప్పటిదాకా ఇంగ్లిష్ గడ్డపై అందని ద్రాక్షలా ఊరిస్తున్న టీ20 సిరీస్‌ను తొలిసారి కైవసం చేసుకుంది. ఆ జట్టుతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా బుధవారం అర్ధరాత్రి (భారత కాలమానం ప్రకారం) ఇక్కడ జరిగిన నాలుగో మ్యాచ్‌లో భారత జట్టు ఆరు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. ఇప్పటిదాకా ఇరు జట్ల మధ్య జరిగిన ఆరు టీ20 సిరీస్‌లలో ఇంగ్లండ్‌దే ఆధిపత్యం కాగా భారత జట్టుకు ఇదే తొలి సిరీస్ విజయం.
తాజా సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లను గెలిచిన టీమ్ఇండియా.. మూడో టీ20లో ఓడినా మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్‌ను సొంతం చేసుకోవడం విశేషం. మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. భారత స్పిన్నర్లు రాధా యాదవ్ (2/15), శ్రీచరణి (2/30) ధాటికి 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 126 పరుగులకే పరిమితమైంది. ఓపెనర్ సోఫియా డంక్లీ (22) టాప్ స్కోరర్. అనంతరం ఛేదనను భారత్ 17 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి దంచేసింది. ఓపెనింగ్ ద్వయం స్మృతి మంధాన (32), షెఫాలీ వర్మ (31)తో పాటు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (26), జెమీమా రోడ్రిగ్స్ (24*) రాణించారు. ఈ సిరీస్‌లో ఆఖరిదైన ఐదో టీ20 శనివారం బర్మింగ్‌హామ్‌లో జరగాల్సి ఉంది.