హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ యువ స్ప్రింటర్, సాంఘిక సంక్షేమ గురుకుల(టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్) విద్యార్థి అగసర నందిని జాతీయస్థాయిలో మరోమారు తళుక్కుమంది. చెన్నై వేదికగా జరుగుతున్న సౌత్‌జోన్ యూనివర్సిటీ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఉస్మానియా యూనివర్సిటీకి చెం దిన నందిని పసిడి పతకంతో మెరిసింది. బుధవారం తమిళనాడు ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీలో జరిగిన మహిళల 100మీటర్ల హర్డిల్స్ రేసును నందిని 13.98 సెకన్ల టైమింగ్‌తో పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచింది. అంజలి (14.32సె), శ్రీరేష్మ (14.37సె) వరుసగా రజత, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. ట్రాక్‌పై చిరుతను తలపించిన నందిని ప్రత్యర్థులకు దీటైన పోటీనిస్తూ స్వర్ణ పతకాన్ని ముద్దాడింది. ప్రస్తుతం డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న నందిని గత కొన్నేండ్లుగా నిలకడగా రాణిస్తున్నది. గురుకుల సొసైటీ సహకారంతో జాతీయ అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేశ్ దగ్గర శిక్షణ పొందుతున్న నందిని పతకాల వేట కొనసాగిస్తున్నది.