WTC Rankings : ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ప్రతి విజయం ఫైనల్ అవకాశాల్ని మెరుగుపరుస్తుంది. అలానే ప్రతి ఓటమి ర్యాంక్‌ను తగ్గిస్తూ పోతోంది. ఇప్పుడు భారత జట్టు (Team India) రెండో పరిస్థితిని ఎదుర్కొంటోంది. డబ్ల్యూటీసీ 2025-27 సీజన్లో ఇంగ్లండ్ గడ్డసూ సిరీస్ సమం చేసి.. వెస్టిండీస్‌ను వైట్‌వాష్ చేయడంతో మూడో ర్యాంక్‌లో నిలిచిన టీమిండియాకు పెద్ద షాక్. ఈడెన్ గార్డెన్స్(Eden Gardens)లో అనూహ్య ఓటమితో భారత ర్యాంక్ పడిపోయింది.
ఈడెన్ గార్డెన్స్‌లో టీమిండియాదే గెలుపు అనుకున్న ప్రతిఒక్కరూ కంగుతిన్నారు. స్వల్ప ఛేదనలో తడబడిన భారత ఆటగాళ్లు సమిష్టి వైఫల్యంతో జట్టును ముంచారు. స్పిన్ ట్రాక్‌ను కోరిమరి తయారుచేయించుకున్నప్పటికీ అదే పిచ్ మీద మనోళ్లు చేతులెత్తేశారు. 124 పరుగుల ఛేదనలో అక్షర్ పటేల్(26) మినహా ఏ ఒక్కరూ కూడా క్రీజులో నిలబడకపోవడంతో ఆలౌటై ఘోర పరాభవం చవిచూసింది.
WTC 2025-2027 ranking as of 16 November 2025! 🏆#wtc #worldtestchampionship #indvsa #testcricket pic.twitter.com/9YrQgUtg6c
— ProSports (@ProSportsStudio) November 16, 2025
పదమూడేళ్ల తర్వాత ఈడెన్స్‌లో విక్టరీ కొట్టిన దక్షిణాఫ్రికా డబ్ల్యూటీసీ పట్టికలో రెండో స్థానానికి దూసుకెళ్లగా.. టీమిండియా నాలుగో స్థానంలో నిలిచింది. మూడు మ్యాచుల్లో మూడు నెగ్గిన ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉంది. గత మూడు మ్యాచుల్లో రెండు విజయాలు, ఒక ఓటమితో సఫారీ టీమ్ రెండో ర్యాంక్ కైవసం చేసుకుంది. ఒక విజయం, రెండు డ్రాలతో శ్రీలంక మూడో స్థానంలో కొనసాగుతోంది.