WCL 2025 : ఈఏడాది దక్షిణాఫ్రికా పట్టిందల్లా బంగారమే అవుతోంది. ఈమధ్యే ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC) టైటిల్ గెలుపొందిన సఫారీ జట్టు.. వరల్డ్ ఛాంపియన్స్ ఆఫ్ లెజెండ్స్ లీగ్ (WCL 2025) విజేతగానూ అవతరించింది. ఏబీ డివిలియర్స్ (120 నాటౌట్) మెరుపు శతకంతో ప్రొటీస్ జట్టు తమ కలను సాకారం చేసుకుంది. పాకిస్తాన్ ఛాంపియన్స్‌తో జరిగిన ఫైనల్లో మిస్టర్ 360 విధ్వంసం సృష్టించాడు. కేవలం 60 బంతుల్లోనే డివిలియన్స్ సెంచరీ బాదేయగా.. దక్షిణాఫ్రికా ఛాంపియన్స్. 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. దాంతో, రెండో సీజన్లో ట్రోఫీని అందుకున్న పాక్ రన్నరప్‌గా సరిపెట్టుకుంది.
మాజీ ఆటగాళ్లు ఒక్క చోట చేరి ఆడుతున్న వరల్డ్ ఛాంపియన్స్ ఆఫ్ లెజెండ్స్‌లో దక్షిణాఫ్రికా విజేతగా నిలిచింది. లీగ్ దశ నుంచి దుమ్మురేపుతున్న సఫారీ జట్టు ఫైనల్లోనూ పంజా విసిరింది. ఇండియా ఛాంపియన్స్ సెమీస్ నుంచి వైదొలగడంతో పాకిస్తాన్ ఛాంపియన్స్‌తో తలపడిన జాక్వెస్ కలిస్ నేతృత్వంలోని ప్రొటీస్ జట్టు సూపర్ విక్టరీ కొట్టింది. తొలుత ఆడిన పాక్‌కు ఓపెనర్ షర్జీల్ ఖాన్ (76) శుభారంభం ఇచ్చాడు. మిడిలార్డర్లో ఉమర్ అమిన్(36), అసిఫ్ అలీ(28)లు రాణించడంతో పాక్ నిర్ణీత ఓవర్లలో రన్స్ చేసింది.
AB de Villiers is probably the only retired cricketer who’s still better than all the active playerspic.twitter.com/3OB1AdCQaK
— yash (@onlydardnod1sco) August 2, 2025
అనంతరం పాక్ నిర్దేశించిన భారీ ఛేదనను సఫారీ ఓపెనర్లు ఏబీ డివిలియర్స్(120 నాటౌట్), హషీం ఆమ్లా(18) ధాటిగా ఆరంభించారు. తొలి వికెట్‌కు 72 రన్స్ కలిపిన ఈ జోడీని అజ్మల్ విడదీశాడు. అతడి బౌలింగ్‌లో ఆమ్లా షాట్‌కు యత్నించి రాయిస్ చేతికి చిక్కాడు. తొలి వికెట్ పడినా.. డివిలియర్స్ తన జోరు తగ్గించలేదు. జీన్ పాలు డుమినీ(50 నాటౌట్)తో కలిసి పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఇద్దరూ దంచేయడంతో ప్రొటీస్ జట్టు గెలుపు దిశగా సాగింది. 12 ఫోర్లు, 7 సిక్సర్లు బాదిన డివిలియర్స్ శతకం సాధించగా.. డుమినీ సూపర్ ఫిఫ్టీతో తమ జట్టును మొదటిసారి ఛాంపియన్‌గా నిలిపారు. దాంతో, రెండో పర్యాయం టైటిల్ ముద్దాడాలనుకున్న పాక్ ఆశలు ఆవిరయ్యాయి.