కోల్‌కతా: బెంగాల్ క్రికెట్ సంఘం ( క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్) అధ్యక్షుడిగా మరోసారి టీమిండియా మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ(Sourav Ganguly) ఎన్నికయ్యారు. సీఏబీ 94వ వార్షిక జనరల్ సమావేశాల్లో సౌరవ్ గంగూలీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో ఆరేళ్ల తర్వాత మళ్లీ గంగూలీ బెంగాల్ క్రికెట్లో కీలక పాత్ర పోషించనున్నారు. గతంలో బెంగాల్ టైగర్ సౌరవ్ 2015 నుంచి 2019 వరకు రాష్ట్ర క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా చేశారు. సోదరుడు స్నేహాశిశ్ గంగూలీ స్థానంలో సౌరవ్ గంగూలీ బాధ్యతలు స్వీకరించనున్నారు. సీఏబీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీతో పాటు ఇతర కీలక పదవులకు కూడా అపాయింట్మెంట్ జరిగింది. సౌరవ్ గంగూలీ ఎన్నికపై సీఏబీ ఎలక్టోరల్ ఆఫీసర్ సుశాంత్ రంజన్ ఉపాధ్యాయ ప్రకటన చేశారు. స్నేహాశిశ్ గంగూలీ మూడేళ్ల పాటు అధ్యక్షుడిగా చేశారు.
టీమిండియాకు సౌరవ్ గంగూలీ సారధ్య బాధ్యతలు నిర్వర్తించాడు. 2019 నుంచి 2022 వరకు బీసీసీఐ అధ్యక్షుడిగా చేశారు. ఐసీసీ మెన్స్ క్రికెట్ కమిటీలో కీలక పదవిలో చేశారు. మళ్లీ బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా ఎన్నిక కావడం పట్ల సౌరవ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో ప్రేక్షకుల కెపాసిటీ పెంచేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సౌరవ్ చెప్పారు. వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్‌కప్‌కు కూడా ప్రియార్టీ ఇవ్వనున్నట్లు తెలిపారు.