ఢిల్లీ: భారత క్రికెట్ జట్టు మాజీ సారథి సౌరవ్ గంగూలీ తన కెరీర్లో కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టనున్నాడు. దక్షిణాఫ్రికాలో జరిగే ‘ఎస్ఏ20’ లీగ్‌లో ప్రిటోరియా క్యాపిటల్స్ జట్టుకు దాదా హెడ్‌కోచ్‌గా వ్యవహరించనున్నాడు. ఈ మేరకు ప్రిటోరియా క్యాపిటల్స్ ఆదివారం తమ సోషల్ మీడియా ఖాతాల వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. 2026 సీజన్ నుంచి గంగూలీ తన బాధ్యతలను చేపట్టనున్నాడు. ప్రిటోరియా జట్టును ఢిల్లీ క్యాపిటల్స్ (జేఎస్‌డబ్ల్యూ స్పోర్ట్స్) నిర్వహిస్తున్న విషయం విదితమే.
క్యాపిటల్స్‌తో దాదాకు చాలాఏండ్లుగా మంచి అనుబంధముంది. బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలను చేపట్టకముందు ఐపీఎల్లో ఢిల్లీ జట్టుకు అతడు 2018-19 సీజన్లకు టీమ్ డైరెక్టర్‌గా వ్యవహరించాడు. గతేడాది జేఎస్‌డబ్ల్యూ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్గానూ బాధ్యతలు చేపట్టాడు. ఒక జట్టుకు పూర్తిస్థాయిలో హెడ్‌కోచ్‌గా పనిచేయనుండటం దాదాకు ఇదే మొదటిసారి. మరి బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్), బీసీసీఐని సమర్థవంతంగా నడిపించిన దాదా.. హెడ్‌కోచ్‌గా ఎలాంటి ముద్ర వేస్తాడో చూడాలి.