కోల్కతా: దేశంలో టెస్టుల నిర్వహణపై భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశారు. సంప్రదాయక టెస్టు వేదికలైన కోల్కతా, ముంబైలోనే కాకుండా దేశంలోని మిగతా వేదికలకూ మ్యాచ్లను విస్తరించాలని సూచించాడు. బీసీసీఐ ఇటీవల విడుదల చేసిన భారత క్రికెట్ జట్టు స్వదేశీ షెడ్యూల్ను దృష్టిలో పెట్టుకుని గంగూలీ స్పందించాడు.
మంగళవారం జరిగిన ‘మిరాకిల్ ఎట్ ఈడెన్’ పుస్తక విడుల కార్యక్రమంలో దాదా మాట్లాడుతూ.. ‘టీమ్ఇండియా 2026-27 స్వదేశీ షెడ్యూల్ను ఒకసారి పరిశీలిస్తే వెస్టిండీస్, శ్రీలంక, జింబాబ్వే, ఆస్ట్రేలియా లాంటి జట్లతో వరుస సిరీస్లు ఉన్నాయి. గతానికి భిన్నంగా ఈసారి కోల్కతా, ముంబై లాంటి వేదికల్లో పరిమిత ఓవర్ల ఫార్మాట్ మ్యాచ్లు జరుగనుండగా, రాంచీ, గువాహటిలో టెస్టు మ్యాచ్లు జరుగడం శుభపరిణామం.
ఇలాగే దేశంలోని వివిధ వేదికల్లో టెస్టు మ్యాచ్లు జరిగేలా షెడ్యూల్ రూపొందించాలి. చెన్నైలో టెస్టు జరుగడం సంతోషం, అదే విధంగా రాంచీ, గువాహటిలో కూడా మెరుగైన వసతులు ఉన్నాయి’ అని అన్నాడు. మరోవైపు 2001 ఆస్ట్రేలియాపై ఈడెన్ గార్డెన్స్ విజయం చారిత్రాత్మకమని గంగూలీ పేర్కొన్నాడు.