దుబాయ్: ఐపీఎల్లో 9 సీజన్ల పాటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన విరాట్ కోహ్లి ఈ సీజన్‌తో తప్పుకున్న విషయం తెలిసిందే. యూఏఈ అంచె లీగ్ ప్రారంభానికి ముందే కోహ్లి కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. మొన్న కోల్‌కతాతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఓడిపోవడంతో తన టీమ్‌కు ఐపీఎల్ ట్రోఫీ అందించాలన్న ఆశ నెరవేరకుండానే కోహ్లి కెప్టెన్సీ ముగిసిపోయింది. అయితే ఆ మ్యాచ్‌లో అంపైర్ వీరేందర్ శర్మపై కోహ్లి ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. సదరు అంపైర్ ఆర్సీబీకి వ్యతిరేకంగా ఇచ్చిన కొన్ని నిర్ణయాలు తర్వాత రీవ్యూలో రివర్స్ అయ్యాయి. దీంతో కోహ్లి అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఈ ఘటన గురించి పరోక్షంగా ప్రస్తావిస్తూ విరాట్‌పై సెటైర్ వేశాడు ఏబీ డివిలియర్స్. మ్యాచ్ తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో తీసిన వీడియోలో కోహ్లి కెప్టెన్సీపై స్పందించిన ఏబీ.. సరదాగా కొన్ని వ్యాఖ్యలు చేశాడు. కోహ్లి కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో ఇక నుంచీ కొంతమంది అంపైర్లు హాయిగా నిద్రపోతారు అని ఏబీ అనడం విశేషం. అదే సమయంలో కోహ్లిపై ప్రశంసలు కురిపించాడు. గొప్ప కెప్టెన్సీ కెరీర్ పూర్తి చేసుకున్నందుకు కోహ్లికి శుభాకాంక్షలు. ఇక నుంచీ స్వేచ్ఛగా ఫీల్డ్‌లోకి వెళ్లి ఆడుతూ ఆర్సీబీకి తొలి ట్రోఫీని, ఇండియాకు మరెన్నో ట్రోఫీలు అందించాలి అని ఏబీ అన్నాడు.