Lanka Premier League 2023 : లంక ప్రీమియర్ లీగ్‌లో ఓ ప్రత్యేక అతిథి(Special Guest) పదే పదే దర్శనమిస్తూ ప్లేయర్లను భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఇటీవల ప్రారంభమైన ఈ లీగ్‌లో ఇప్పటి వరకు 17 మ్యాచ్‌లు జరగగా.. వాటిలో మూడు సార్లు ప్రత్యేక అతిథి దర్శనమిచ్చింది. అతిథితో ఇబ్బంది ఏంటీ అనుకుంటున్నారా? ఆ గెస్ట్ మరెవరో కాదు.. నాగుపాము!
లీగ్ ఆరంభమైన రెండో మ్యాచ్‌లోనే స్టేడియంలో పాము దర్శనమివ్వగా మ్యాచ్‌కు కాసేపు అంతరాయం వాటిల్లింది. ఆ తర్వాత మరో మ్యాచ్‌లోనూ దాదాపు ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. అయితే బౌండ్రీ సమీపంలో కెమరామెన్ కూర్చునే చోట పాము దర్శనమిచ్చింది. ఇక ముచ్చటగా మూడోసారి మైదానంలోకి వచ్చేసిన పాము లంక పేసర్ ఇసూరు ఉడానా(Isuru Udana) బౌలింగ్ చేస్తున్న సమయంలో అతడికి చాలా సమీపం నుంచి వెళ్లింది.
Isuru Udana’s Lucky escape 🐍#LPL2023 #LPLT20 pic.twitter.com/olOqL21UUr
— Home of T20 (@HomeofT20) August 13, 2023
దీంతో ఉలిక్కిపడ్డ ఉడానా అక్కడి నుంచి పక్కకు తప్పుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి. దీంతో అభిమానులు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ‘ఇది బంగ్లాదేశ్ అనుకుంటున్నావా.. నాగిని డ్యాన్స్ చేసేందుకు పదే పదే వస్తున్నావు’ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా, సఅది కూడా క్రికెట్ లవర్ అయి ఉంటుందసని మరొకరు వ్యాఖ్యానించారు.
సాధారణంగా ప్రకృతి వైపరిత్యాలు, భారీ వర్షాల వల్ల క్రికెట్ మ్యాచ్‌లు ఆగిపోవడం గతంలో అందరికీ అనుభవమే. వీటితో పాటు పలు అనివార్య కారణాల వల్ల కూడా అప్పుడప్పుడు మ్యాచ్‌లకు ఆటంకం కలుగుతూ ఉంటుంది. అభిమానులు మైదానంలోకి దూసుకురావడం, ఒకేసారి పెద్ద సంఖ్యలో పక్షులు మైదానంలో దిగడం, గ్రౌండ్లోకి కుక్కలు ప్రవేశించడం.. ఇలాంటి కారణాల వల్ల అప్పుడప్పుడు మ్యాచ్‌లకు అంతరాయం కలగడం చూసే ఉంటాం. కొన్నిసార్లు తేనెటీగల వల్ల కూడా మ్యాచ్‌లు ఆగిన ఉదంతాలు ఉన్నాయి. అయితే లంక ప్రీమియర్ లీగ్‌ను విచిత్రంగా పాము సమస్య వేధిస్తోంది.