దుబాయ్ : మహిళా క్రికెట్లో తనకెవరూ సాటిలేరని భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన (64 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్స్‌లతో 124) నిరూపించింది. ఆసియా కప్ టీ20 టోర్నీలో అద్భుత శతకంతో భారత్‌ను సెమీఫైనల్ చేర్చుతూ రికార్డుల దుమ్ముదులిపింది. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధికంగా 18వ సెంచరీతో పాటు అన్ని ఫార్మాట్లలో ఎక్కువ పరుగులు చేసిన బ్యాటర్‌గానూ చరిత్రకెక్కింది. ఈ బ్యాట్ బ్యూటీ మెరుపులతో గురువారం జరిగిన గ్రూప్-ఏ మ్యాచ్‌లో భారత్ 137 పరుగుల భారీ తేడాతో హాంకాంగ్‌ను చిత్తుగా ఓడించింది. దాయాది పాకిస్థాన్‌తో పోరుకు ముందే సెమీస్ బెర్తును ఖాయం చేసుకుంది. ఈ ఏకపక్ష పోరులో మొదట మంధాన రికార్డు శతకంతో భారత్ 20 ఓవర్లకు 193/5 పరుగుల భారీ స్కోరు చేసింది. లక్ష్య ఛేదనలో హాంకాంగ్.. 16.2 ఓవర్లలో 56 రన్స్‌కే పరిమితమైంది. కెప్టెన్ నటాషా (15) టాప్ స్కోరర్. స్మృతికే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ లభించింది. ఈ టోర్నీ గ్రూప్ దశలో భాగంగా భారత్.. శనివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది.
భారత ఇన్నింగ్స్‌లో స్మృతి ఆటే హైలైట్. బౌండరీతో బాదుడుకు శ్రీకారం చుట్టిన ఆమె.. మరో ఓపెనర్ షెఫాలీ (17 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 28)తో కలిసి ఆరంభం నుంచే ప్రత్యర్థి బౌలర్లపై దండయాత్రకు దిగింది. మర్యమ్ ఓవర్లో ఎక్స్ట్రా కవర్స్ దిశగా చూడచక్కని డ్రైవ్‌తో బౌండరీ కొట్టిన ఆమె.. అదే ఓవర్లో మరో రెండుసార్లు బంతిని బౌండరీ లైన్ దాటించింది. ఆ తర్వాత బాదుడు షెఫాలీ వంతు. మరీనా వేసిన ఐదో ఓవర్లో ఆమె.. 4, 6, 4, 6తో రెచ్చిపోయింది. ధాటిగా ఆడే క్రమంలో షెఫాలీని.. 8వ ఓవర్లో రుచిత ఔట్ చేయడంతో 48 బంతుల్లోనే 78 రన్స్ జతచేసిన తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఇక్రా సహర్ విసిరిన 11వ ఓవర్లో సిక్స్‌తో 40 బంతుల్లో అర్ధ శతకం సాధించిన ఆమె, ప్రతీక రావల్ (10) నిష్క్రమణ తర్వాత మరింత చెలరేగి ఆడింది. పసలేని హాంకాంగ్ బౌలర్లను ఉతికారేస్తూ బౌండరీలు, సిక్సర్ల మోత మోగించింది. ఫిఫ్టీ తర్వాత ఆమె విశ్వరూపమే చూపించిదనడంలో అతిశయోక్తేమీ లేదు. మర్యమ్ వేసిన 14వ ఓవర్లో రెండు సిక్స్‌లు దంచిన ఆమె.. జోయ్లిన్ బౌలింగ్‌లో 6, 4, 4తో 90ల్లోకి వచ్చింది. 95 పరుగుల వద్ద క్యాచ్ మిస్ అవడంతో లైఫ్ లభించిన ఆమె.. బౌండరీతో సెంచరీని పూర్తిచేసింది. ఫిఫ్టీ నుంచి సెంచరీకి రావడానికి ఆమె 18 బంతులు మాత్రమే తీసుకోవడం గమనార్హం. టీ20ల్లో మంధానకు ఇది రెండో సెంచరీ. ఆ వెంటనే రుచిత 18వ ఓవర్లో హ్యాట్రిక్ సిక్స్‌లు దంచిన భారత వైస్ కెప్టెన్.. ఈ క్రమంలో మిథాలీ రాజ్ అత్యధిక పరుగుల రికార్డునూ అధిగమించింది. చివరి ఓవర్లో రనౌట్ అయినా అప్పటికే భారత్ భారీ స్కోరు అందుకుంది.
రికార్డు ఛేదనలో అంతగా అనుభవం లేని హాంకాంగ్.. భారత బౌలర్ల ధాటికి ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేకపోయింది. రెండో ఓవర్లోనే తొలి వికెట్ కోల్పోయిన ఆ జట్టులో నటాషా, యాస్మిన్ (11), మరీనా (14) మినహా మిగిలివారెవరూ డబుల్ డిజిట్ చేరడానికే నానా తంటాలు పడ్డారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ (3/9) మూడు వికెట్లు దక్కగా నందని, శ్రీచరణి, ప్రేమ రావత్‌కు చెరో రెండు వికెట్లు దక్కాయి.
1 మహిళల క్రికెట్లో మూడు ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా స్మృతి(10,880).. మిథాలీ రాజ్ (10,868) రికార్డును బ్రేక్ చేసింది.
18 విమెన్స్ క్రికెట్లో అత్యధికంగా 18 శతకాలు చేసిన బ్యాటర్ స్మృతి. ఆసీస్ మాజీ సారథి మెగ్ లానింగ్ (17), సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్ట్ (17)ను వెనక్కినెట్టింది.
2 విమెన్స్ ఆసియా కప్‌లో లంక సారథి చమరి ఆటపట్టు తర్వాత సెంచరీ చేసిన రెండో క్రికెటర్ మంధాన.
1 భారత్ నుంచి టీ20ల్లో రెండు సెంచరీలు చేసిన తొలి బ్యాటర్ మంధాన. అంతేగాక ఈ ఫార్మాట్లో భారత్ తరఫున అత్యధిక స్కోరు కూడా ఆమెదే.
భారత్: 20 ఓవర్లకు 193/5 (స్మృతి 124, షెఫాలీ 28, మరీనా 2/46, జోయ్లిన్ 1/12)
హాంకాంగ్: 16.2 ఓవర్లకు 56 ఆలౌట్ (నటాషా 15, మరీనా 14, దీప్తి 3/9, నందని 2/6)