సిటీబ్యూరో, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ) : రేవంత్‌రెడ్డి వెయ్యి రోజుల పాలన వైఫల్యంపై డ్రైవరన్నలు రగిలిపోతున్నారు. తమ ఉపాధి కోల్పోయి రోడ్డున పడినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని తెలిపారు. కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లో అందరూ ఇండ్లకే పరిమితమై.. గిరాకీ లేక డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాహన పన్ను చెల్లించలేకపోయారు. ఓ వైపు కుటుంబ పోషణ, వాహనం ఈఎంఐలు చెల్లించలేక మనోవేదనకు గురయ్యారు. ఓ వైపు కరోనా పరిస్థితులు కబళిస్తున్నా..
మరోవైపు ఆర్థికంగా కుదేలవుతున్న డ్రైవరన్నల బతుకుల్లో కేసీఆర్ ధైర్యాన్ని నింపారు. ఏకంగా రెండు త్రైమాసికాల వాహన పన్ను రద్దు చేసి వారికి కొండంత అండగా నిలిచారు. మరోవైపు రూ.5 లక్షల ప్రమాద బీమా కల్పించారు. వాహనాల చలాన్ల రాయితీ అందించారు. ఆ సమయంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ల్లో బస్సులు, లారీలు, క్యాబ్స్ తదితర వాణిజ్య వాహనాలు సుమారు 1.35 లక్షల వరకు ఉంటాయి.
వీటిపై ప్రతి మూడు నెలలకోసారి మోటార్ వెహికల్ టాక్స్‌ను చెల్లించాలి. వాహన కేటగిరీని బట్టీ ట్యాక్స్ ధరలు నిర్ణయిస్తారు. ఈ లెక్కన గ్రేటర్లో సుమారు 135 కోట్లకు పైగా వాహన పన్నును మాఫీ చేసి డ్రైవరన్నలకు కేసీఆర్ బాసటగా నిలిచారు. సమస్య ఉందంటే.. కేసీఆర్ క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి పరిష్కరించేవారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి వెయ్యి రోజుల పాలనలో ఉపాధి లేక చనిపోతున్న డ్రైవర్లను పట్టించుకున్న పాపానపోలేదు. కనీసం వారికిచ్చిన హామీలను సైతం నెరవేర్చలేదు. రేవంత్ రెడ్డి కేసీఆర్‌ను చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉందని డ్రైవర్లు చెబుతున్నారు.
వెయ్యి రోజులైనా సమస్యలు అట్లనే
రేవంత్ సీఎంగా వెయ్యి రోజులు పూర్తయ్యాయి. కానీ రవాణా రంగ కార్మికులకు ఒనగూరిందేమీలేదు. సంక్షేమ బోర్డు లేదు. సంక్షేమాన్ని నీరుగార్చారు. ఏదైనా ఒక పథకం తీసుకొస్తే అది కొందరికి ఉపయోగపడుతుండొచ్చు. కానీ ఆ పథకం వల్ల చాలా మంది ఉపాధి పోవద్దు. రేవంత్‌రెడ్డి ఇష్టానుసారంగా హామీలిచ్చి ఇప్పుడు పట్టించుకోవడం లేదు. క్షేత్రస్థాయిలో డ్రైవర్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం డ్రైవర్ల సమస్యలపై మాట్లాడే తీరిక కూడా సీఎం రేవంత్‌కు లేకపోవడం దారుణం. కచ్చితంగా డ్రైవర్ల ఆగ్రహం రేవంత్‌రెడ్డి చవి చూడాల్సి వస్తుంది.
– సూర్వి యాదయ్యగౌడ్, తెలంగాణ లారీ వెల్ఫేర్ అసోసియేషన్
రేవంత్ వెయ్యి రోజుల పాలనలో ఆత్మహత్యలే
డ్రైవరన్నల సమస్యలు పట్టించుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చొద్యం చూస్తున్నది. వెయ్యి రోజుల పాలనలో మాకు మిగిలినవి ఆత్మహత్యలే. ఏడాదికి ఆటో డ్రైవర్లకు ఇస్తానన్న రూ. 12వేలు ఎక్కడ? సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని హామీలివ్వడమే కానీ అమలు లేదు. ఉచిత బస్సుతో ఆటో, క్యాబ్‌ల గిరాకీ పడిపోయింది. ఓలా, ఉబర్, ర్యాపిడోలతో డ్రైవర్ల శ్రమకు విలువలేకుండాపోయింది. ఆదుకోవాలని చెబుతున్నా..ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కేసీఆర్ పాలనలో రవాణా రంగంలో టాక్సీ డ్రైవర్లు డ్రైవర్‌గా ఉండకూడదు.. ఓనర్లుగా మారాలి అని ఆలోచించి ఎస్సీ ఎస్టీ మైనార్టీ డ్రైవర్స్ మిత్రులకు ఓనర్ కమ్ డ్రైవర్ పథకం ద్వారా ఏటా సబ్సిడీ రూపంలో టాక్సీ వాహనాలు అందించారు. కానీ రేవంత్ రెడ్డి డ్రైవరన్నల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. పరిపాలన చేతకాకపోతే రేవంత్‌రెడ్డి సీఎం పదవి నుంచి దిగిపోవాలి.
– నగేశ్, బీఆర్టీయూ క్యాబ్ అసోసియేషన్ ప్రెసిడెంట్
సమస్యపై స్పందించడం తెలియాలి
ఆటో డ్రైవర్లకు రోడ్డు రవాణా పన్ను క్వాటర్లీ ట్యాక్స్ శాశ్వతంగా మాఫీ చేసిన ఘనత కేసీఆర్‌దే. డ్రైవర్లకు ఒక పెద్ద దికుగా కేసీఆర్ నిలిచారు. డ్రైవర్లు కరోనా బారిన పడుతూ పిట్టల్లా రాలిపోతున్న సమయంలో డ్రైవర్లను ఫ్రైంట్లెన్ వరర్స్గా గుర్తించి టాక్సీ ఆటో డ్రైవర్లకు రాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా చేసింది. కరోనా లాక్ డౌన్ సమయంలో ప్రైవేట్ సూల్ బస్సు డ్రైవర్లకు నెలకు 2,000 రూపాయలు, 25 కిలోల బియ్యం 10 వేల పైచిలుకు సూల్ బస్సు డ్రైవర్లకు సర్కార్ అందించి అండగా నిలిచింది. కష్టమొచ్చినప్పుడు డ్రైవరన్నలను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. రేవంత్ పాలనలో డ్రైవర్లపై నిర్లక్ష్యం కనిపిస్తున్నది. ఈ వెయ్యి రోజుల పాలనలో డ్రైవర్ల కష్టాలు రెట్టింపయ్యాయి.
– సత్తిరెడ్డి, ఆటో యూనియన్ నాయకులు