బీజింగ్, సెప్టెంబర్ 3: ‘అడవిలో ఆకులు.. ఎడారిలో ఇసుకను అమ్మగలిగే వాడే అసలైన వ్యాపారి’ అన్న నానుడిని చైనాకు చెందిన ఒక యువ వ్యాపారవేత్త ఆచరణాత్మకంగా రుజువుచేసి మరీ చూపించాడు. ఎవరికీ రాని ఒక వినూత్న ఆలోచనతో అందరినీ ఆశ్చర్యపోయేలా ఒక కొత్త సర్వీస్‌కు శ్రీకారం చుట్టాడు. ‘రండి మీ దురద తీరుస్తాం.. మీ వీపే కాదు.. ఎక్కడైనా గోకి మీకు ఉపశమనం కలిగిస్తాం’ అంటూ అతను చేస్తున్న ‘దురద గోకుడు’ వ్యాపారానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తున్నది. దీంతో ‘గోకితే చాలు లక్షలు’ అన్నట్టు ఆయన వ్యాపారం అభివృద్ధి దిశలో పరుగులు పెడుతున్నది.
హుబే ప్రావిన్స్‌కు చెందిన 32 ఏండ్ల జాంగ్ జియోకియావో అందరికన్నా భిన్నంగా ఆలోచించి సుమా బ్రాండ్ కింద షెన్జెన్లో ఒక సర్వీస్‌ను ప్రారంభించాడు. వీపుతో పాటు ఇతర భాగాల్లో దురదలతో ఇబ్బంది పడే వారికి మసాజ్ పార్లర్ తరహాలో బెడ్స్ వేసి ప్రత్యేకంగా డిజైన్ చేసిన గోర్ల వంటి పరికరాలతో గోకి ఉపశమనం కలిగించేలా ప్రత్యేక సిబ్బందితో ఒక పార్లర్‌ను ప్రారంభించాడు. దీనికి గంటకు 300 యువాన్లు (రూ.4,200) చార్జీ చేశాడు. కాగా, మొదటి శ్రేణి నగరాల్లోని పౌరులు సాధారణంగా అత్యధిక ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉంటారు. దీంతో ఆ నగరంలో ఈ పార్లర్‌కు మంచి డిమాండ్ ఏర్పడింది.
పౌరులు ఈ పార్లర్‌కు క్యూ కట్టడం ప్రారంభించారు. దీంతో రెండో పార్లర్‌ను కూడా ప్రారంభించాడు. ప్రస్తుతం రెండు పార్లర్ల నుంచి నెలకు రూ.14 లక్షల ఆదాయం వస్తున్నట్టు జాంగ్ తెలిపాడు. తమ పార్లర్లో సేవలు పొందిన వారు మసాజ్ కన్నా ఎక్కువగా సేదతీరుతున్నట్టు వెల్లడించారన్నారు. చిన్నప్పుడు తన తండ్రి తరచూ తనతో వీపు గోకించుకునే వారని, తాను గోకుతున్నప్పడే ఆయన నిద్రలోకి జారుకునే వారని, ఆ చర్య శరీరానికి అంత ఉపశమనం, హాయిని ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. దీనిపై తాను పరిశోధనలు చేసి ఎలా గోకితే వినియోగదారులు ఉపశమనం పొందుతారో తెలుసుకున్నానన్నారు. భవిష్యత్‌లో చైనా వ్యాప్తంగా 100 కేంద్రాలు తెరువాలనుకుంటున్నట్టు ఆయన వెల్లడించారు.