ఇల్లంతకుంట, సెప్టెంబర్ 3: వానకాలంలో సాగు చేసిన పంటలు ఎండిపోకముందే సాగునీటిని అందించి ఆదుకోవాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వంతడుపుల శివారులోని కెనాల్ బ్రిడ్జిపై గురువారం రైతులు ధర్నా చేపట్టారు.
వంతడుపుల, రంగంపేట, తెనుగువానిపల్లి, వల్లంపట్ల గ్రామాల రైతులు ధర్నా చేస్తుండగా వారికి బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా జడ్పీ మాజీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు మాట్లాడుతూ.. మధ్యమానేరు ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా నీటిని విడుదల చేస్తే 15వేల ఎకరాలకు సాగు నీరు అందుతుందని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే రైతులను ఏ మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు.