బ్యాంకాక్: సన్యాసం స్వీకరించడం కోసం థాయ్‌లాండ్‌లోని ఐస్‌క్రీమ్ బ్రాండ్ హేవెల్స్ను దాని యజమాని సుమారు రూ.56 కోట్లకు అమ్మకానికి పెట్టారు. తన వ్యాపారాన్ని నిర్వహించగలిగే వారసుడి కోసం వెతుకుతున్నట్టు సిరిపోంగ్ అక్కరస్రియుక్ గత నెలలో ఒక ఫేస్బుక్ పోస్ట్‌లో ప్రకటించారు. అరహంత్(బౌద్ధంలో నిర్వాణం పొందిన వ్యక్తి)గా మారాలన్న తన చిరకాల లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం కోసం తన సంస్థను అమ్మకానికి పెట్టినట్టు ఆయన వివరించారు. తన వ్యాపార విస్తరణలో ఎదురవుతున్న సమస్యలు కూడా తన కంపెనీ అమ్మకానికి ఒక కారణమని పేర్కొన్నారు.
‘గత రెండేండ్లుగా కొత్త అవుట్లెట్లను ప్రారంభించడానికి ఎన్నో షాపింగ్ మాల్స్‌ను సంప్రదించినా ప్రయోజనం లేకుండా పోయింది’ అని తన పోస్ట్‌లో వెల్లడించారు. బ్యాంకాక్ పోస్ట్ కథనం ప్రకారం ఒకప్పుడు థాయ్‌లాండ్ అంతటా విస్తరించిన హేవెల్స్ క్రమంగా క్షీణించింది. ఇప్పుడు కేవలం ఒక స్టోర్ మాత్రమే మిగిలి ఉంది. వచ్చే రెండేండ్లలో అడవిలో ఆశ్రమం నిర్మించుకొని సన్యాసిగా ధ్యాన సాధన చేయాలనేది తన ఆలోచన అని సిరిపోంగ్ తెలిపారు. ‘నేను నా లక్ష్యమైన అరహంతత్వం సాధిస్తే, ఈ ప్రాపంచిక సమాజానికి తిరిగివచ్చి నా కూతురు, భార్య, బంధువులకు ధమ్మ(ధర్మ) సాధనను బోధిస్తాను’ అని ఆయన వెల్లడించారు. తన కంపెనీకి తగిన వారసుడిని వెతికి పెట్టడంలో సాయం చేసేవారికి రూ.1.43 కోట్ల రెఫరల్ ఫీజును అందిస్తానని ప్రకటించారు.