నమస్తే తెలంగాణ నెట్వర్క్, సెప్టెంబర్ 3: కాంగ్రెస్ సర్కార్ వెయ్యి రోజుల విఫల పాలనలో వ్యవసాయ విధ్వంసం, రైతు వ్యతిరేక విధానాలపై బీఆర్ఎస్ గర్జించింది. రైతులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, వాగ్ధానాలు నెరవేర్చకపోగా, గత ప్రభుత్వంలో అమలైన పథకాలకు ఎగనామం, కోత పెడుతుండడంపై ఆగ్రహించింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు రెండో రోజు గురువారం రాష్ట్రవ్యాప్తంగా మండల కేంద్రాలు, పట్టణాల్లో ధర్నాలు, రాస్తారోకోలు చేసింది.
రైతులను వంచించిన ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని హెచ్చరించింది. రైతు నిరసన సదస్సులు నిర్వహించింది. ఈ సదస్సుల్లో రేవంత్ సర్కార్‌ను రైతులు, గులాబీ నేతలు ఎక్కడికక్కడ నిలదీశారు. కాంగ్రెస్ మోసాలపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం కోయచలకలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ ఎడ్ల బండ్ల ప్రదర్శన నిర్వహించారు. సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఖమ్మం జిల్లా కల్లూరులో 500 ట్రాక్టర్లతో భారీ ర్యాలీ చేశారు.

నారాయణపేట జిల్లా కోస్గిలో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, మహబూబ్‌నగర్ రూరల్ మండలం కోడూరు చౌరస్తాలో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, వనపర్తి జిల్లా పెబ్బేరు, ఖిల్లాఘణపురంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, నిజామాబాద్ జిల్లా వేల్పూర్ ఎక్స్‌రోడ్డు వద్ద మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ సర్కిల్ ఎదులాబాద్‌లో మాజీ మంత్రి మల్లారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేటలో మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి, మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలంలోని ఉప్పరగూడెంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రేకుర్తి చౌరస్తాలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, వీణవంకలో ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, జగిత్యాల జిల్లా రాయికల్‌లో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ జీవన్‌రెడ్డి, మాజీ మంత్రి కొప్పుల, జడ్పీ మాజీ చైర్పర్సన్ వసంత, మల్లాపూర్‌లో కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కల్వకుంట్ల, కొడిమ్యాలలో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్,
మంచిర్యాల జిల్లా చెన్నూర్‌లోని జైపూర్‌లో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ జీవన్‌రెడ్డి, మాజీ విప్ బాల్క సుమన్, ఆదిలాబాద్ నియోజకవర్గం భోరజ్‌లో మాజీ మంత్రి జోగు రామన్న, సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కొత్త ప్రబాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ వంటేరి యాదవరెడ్డి, టీజీఐఐసీ మాజీ చైర్మన్ బాలమల్లు, హుస్నాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్, చేర్యాలలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మెదక్‌లో మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పట్లోల్ల శశిధర్‌రెడ్డి, సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, మెదక్ జిల్లా టేక్మాల్‌లో అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, పెద్దపల్లి, సుల్తానాబాద్ పట్టణాలు, ఓదెల, కాల్వశ్రీరాంపూర్, జూలపల్లి, ఎలిగేడు మండల కేంద్రాల్లో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, ముత్తారంలో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్, పాలకుర్తిలో రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటిచందర్ తదితరులు బీఆర్ఎస్ నేతలు, రైతులతో కలిసి రైతు సదస్సు ప్రాంగణాల వరకు ఎడ్లబండ్లతో ర్యాలీ తీసి, నిరసన తెలిపారు. అనంతరం ధర్నాలు, ఆందోళనలు చేశారు.

శంకరపట్నంలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, జిల్లా అధ్యక్షుడు జీవీఆర్ భారీ ధర్నా నిర్వహించి వంటావార్పులో పాల్గొన్నారు. సంగారెడ్డిలోని కలెక్టరేట్ ఎదుట రోడ్డుపై ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు వంటా వార్పు చేసి నిరసన తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్ గ్రామంలో సాగుకు నీళ్లు విడుదల చేయాలని స్థానిక బీఆర్ఎస్ నాయకులు మల్కపేట కాలువలో నిల్చొని నిరసన తెలిపారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎదుట కామారెడ్డి-కరీంనగర్ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు.
చిన్నచింతకుంటలో ర్యాలీని అడ్డుకున్న కాంగ్రెస్

మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండల కేంద్రంలో రైతులతో కలిసి నిరసన ర్యాలీ నిర్వహిస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ర్యాలీతో అడ్డుపడి దౌర్జన్యంగా దాడి చేయాలని చేసిన ప్రయత్నాన్ని బీఆర్ఎస్ సైనికులు తిప్పికొట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డితోపాటు బీఆర్ఎస్ శ్రేణులు రోడ్డుపైన బైఠాయించి నిరసనకు దిగారు. పోలీసులు బలవంతంగా లాగేందుకు ప్రయత్నించినా అక్కడి నుంచి కదలకుండా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆల మాట్లాడుతూ.. ముందుగా బీఆర్ఎస్ ర్యాలీ తేదీని ప్రకటించినప్పటికీ, కావాలనే కాంగ్రెస్ పార్టీ గురువారం రోజే ర్యాలీని నిర్వహించినట్లు తెలుస్తుందన్నారు. పోలీసులను అడ్డంపెట్టుకొని ఎన్నిదినాలు ఇలాంటి దుష్ట చర్యలు చేస్తారో చేయండని, ఇదంతా ప్రజలు గమనిస్తున్నారని, దానికి తప్పకుండా బదులు తీర్చుకునే సమయం వస్తుందని ఆయన హెచ్చరించారు.



