దంబుల్లా : ముక్కోణపు వన్డే సిరీస్‌లో భారత్-ఏ జట్టుకు మరో షాక్ తగిలింది. తిలక్‌వర్మ సారథ్యంలోని జట్టు శ్రీలంక-ఏ చేతిలో అనూహ్యంగా ఓడిపోయింది. సోమవారం నాటకీయ పరిణామాల మధ్యసాగిన పోరులో భారత్ సూపర్ ఓవర్లో లంక చేతిలో పరాజయం పాలైంది. తొలుత ఇరు జట్ల స్కోర్లు సమం(265) కావడంతో విజేతను నిర్ణయించేందుకు సూపర్ ఓవర్ అనివార్యమైంది. భారత బౌలర్ అర్షద్‌ఖాన్ వేసిన ఈ ఓవర్లో లంక వికెట్ నష్టపోకుండా 16 పరుగులు చేసింది. ఆ తర్వాత భారత్-ఏ తరఫున సూర్యాంశ్ షెగ్డె, వైభవ్ సూర్యవంశీ ఆరు బంతుల్లో 9 పరుగులు మాత్రమే చేయడంతో జట్టుకు ఓటమి తప్పలేదు. అంతకుముందు భారత్-ఏ 49.2 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌటైంది.
సూర్యాంశ్ (72), విప్రాజ్ నిగమ్(51) అర ్ధసెంచరీలతో రాణించారు.ఎనిమిదో వికెట్‌కు 104 పరుగులు జోడించి జట్టుకు మంచి స్కోరు అందించారు. అనంతరం ఛేదనలో లంక ఓవర్లన్నీ ఆడి 9 వికెట్లకు సరిగ్గా 265 రన్స్ చేయడంతో మ్యాచ్ టై అయ్యింది. సదీరా సమరవిక్రమ (93) సత్తా చాటాడు. ఆఖరి ఓవర్లో లంక విజయానికి 5 పరుగులు అవసరం కాగా అర్షద్‌ఖాన్ అద్భుతమైన యార్కర్లతో నాలుగు పరుగులే ఇచ్చాడు. ఈ తరుణంలో సూపర్ ఓవర్‌పై సందిగ్ధత ఏర్పడింది. అంపైర్లతో కెప్టెన్ తిలక్ సుదీర్ఘ వాదనల తర్వాత మొదలైన సూపర్ ఓవర్లో భారత్-ఏ జట్టుకు నిరాశ తప్పలేదు. బుధవారం జరిగే తర్వాతి మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌తో భారత్-ఏ తలపడనుంది.