Olympics | న్యూఢిల్లీ: లాస్ఎంజిల్స్ వేదికగా 2028లో జరుగనున్న ఒలింపిక్స్‌లో ఆరు క్రికెట్ జట్లకు అవకాశం కల్పించారు. దాదాపు 128 ఏండ్ల తర్వాత తొలిసారి విశ్వక్రీడల్లో భాగం కాబోతున్న క్రికెట్లో పురుషుల, మహిళల విభాగాల్లో ఆరేసి జట్లు ప్రాతినిధ్యం వహించనున్నాయి. అయితే గతానికి భిన్నంగా ఈసారి లాస్ఎంజిల్స్ ఒలింపిక్స్‌లో టీ20 ఫార్మాట్లో మ్యాచ్‌లు జరుగనున్నాయి. అయితే ఆతిథ్య హోదాలో అమెరికా బెర్తు ఖరారు కాగా, మిగిలిన ఐదు జట్ల ఎంపికపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
ప్రస్తుతం ఐసీసీలో 12 పూర్తిస్థాయి సభ్యత్వహోదా దేశాలు ఉండగా, 94 అసోసియేట్ దేశాలు ఉన్నాయి. ఐసీసీ ర్యాంకింగ్స్ ఆధారంగా జట్ల ఎంపిక ఉండే అవకాశముంది. ఇదిలా ఉంటే లాస్ఎంజిల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌తో పాటు బేస్‌బాల్/సాఫ్ట్‌బాల్, ఫ్లాగ్ ఫుట్‌బాల్, లాక్కోసె, స్కాష్ ఉన్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి టీమ్ ఈవెంట్లలో పురుషులతో పాటు మహిళలకు సమాన అవకాశం కల్పించారు.