Badminton | టోక్యో (జపాన్): కొద్దిరోజుల క్రితమే పారిస్ వేదికగా ముగిసిన పారాలింపిక్స్‌లో రికార్డు స్థాయిలో పతకాలు సాధించిన భారత పారా షట్లర్లు జపాన్ పారా బ్యాడ్మింటన్ ఇంటర్నేషనల్ టోర్నీలోనూ సత్తా చాటారు. ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో భారత్ ఏకంగా 24 పతకాలు సాధించింది. మన పారా షట్లర్లకు 6 స్వర్ణాలు, 9 రజతాలు, 9 కాంస్యాలు దక్కాయి. ఎస్‌హెచ్6 (సింగిల్స్, డబుల్స్) కేటగిరీలో శివరాజన్ సొలైమలై రెండు స్వర్ణాలు కొల్లగొట్టాడు.
ఎస్‌హెచ్6 ఫైనల్లో శివరాజన్.. 21-16, 21-16తో వోంగ్ (వియత్నాం)ను చిత్తుచేశాడు. మరో షట్లర్ సుకంత్ కదం సైతం పురుషుల సింగిల్స్ (ఎస్ఎల్ 4)లో పసిడి నెగ్గగా ఎస్ఎల్ 3, 4 డబుల్స్ ఈవెంట్స్‌లో దినేశ్ రాజయ్యతో కలిసి రజతం సాధించాడు. పారాలింపిక్స్ చాంపియన్ కుమార్ నితేశ్ ఎస్ఎల్ 3 ఫైనల్స్‌లో ఓడి రజతంతో సరిపెట్టుకున్నాడు. మహిళల విభాగంలో మనీషా రామదాస్ బంగారు పతకం (ఎస్‌యూ5) సాధించింది.