US Open న్యూయార్క్: యూఎస్ ఓపెన్‌లో టాప్ సీడ్ ఆటగాళ్లు కార్లోస్ అల్కారజ్ (స్పెయిన్), జన్నిక్ సిన్నర్ (ఇటలీ), డేనియల్ మెద్వెదెవ్ శుభారంభం చేశారు. పురుషుల సింగిల్స్‌లో మూడో సీడ్ అల్కారజ్ 6-2, 4-6, 6-3, 6-1తో లి టు (ఆస్ట్రేలియా)ను ఓడించాడు. తొలి సెట్‌ను అలవోకగానే గెలుచుకున్న అల్కారజ్ రెండో సెట్లో తడబడ్డా తర్వాత పుంజుకున్నాడు. ఈ విజయంతో అతడు గ్రాండ్‌స్లామ్ ఈవెంట్స్‌లో 60వ విజయం నమోదు చేసుకున్నాడు. ఇటీవల డోపింగ్ ఆరోపణలు ఎదుర్కుంటున్న ఒకటో సీడ్ సిన్నర్.. 2-6, 6-2, 6-1, 6-2తో మాకీ మెక్‌డొనాల్డ్ (యూఎస్ఏ)ను మట్టికరిపించాడు. రష్యన్ ఆటగాడు మెద్వెదెవ్ 6-3, 3-6, 6-3, 6-1తో డుసాన్ లెజొవిచ్ (సెర్బియా)ను ఓడించి రెండో రౌండ్‌కు దూసుకెళ్లాడు. ‘గ్రీకు’ వీరుడు స్టెఫనోస్ సిట్సిపస్ తొలి రౌండ్లోనే ఇంటిబాట పట్టాడు.
రదుకాను ఔట్: మహిళల సింగిల్స్‌లో 2021 చాంపియన్ ఎమ్మా రదుకాను (బ్రిటన్) 1-6, 6-3, 4-6తో సొఫియా కెనిన్ (అమెరికా) చేతిలో ఓటమిపాలై తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. మాజీ యూఎస్ చాంపియన్ నవోమి ఒసాకా 6-3, 6-2తో ఒస్టపెంకో(లాట్విన్)పై అలవోకగా గెలిచింది. మహిళల టెన్నిస్‌లో నంబర్‌వన్, టాప్ సీడ్ ఇగా స్వియాటెక్ (పోలండ్) 6-4, 7-6 (8/6)తో కమిల్ల రఖిమొవా(రష్యా)పై నెగ్గింది. వీరితో పాటు వొజ్నియాకి (డెన్మార్క్), ఆండ్రీవా (రష్యా), జాస్మిన్ పలోని (ఇటలీ) రెండో రౌండ్‌కు అర్హత సాధించారు.
యూఎస్ ఓపెన్ చరిత్రలో మంగళవారం అత్యంత సుదీర్ఘమైన మ్యాచ్ జరిగింది. కరెన్ కచనోవ్ (రష్యా), డాన్ ఎవాన్స్ (బ్రిటన్) మధ్య హోరాహోరిగా జరిగిన పోరు ఏకంగా 5 గంటల 35 నిమిషాల పాటు కొనసాగింది. టెన్నిస్ ఓపెన్ ఎరాలో భాగంగా 1970 నుంచి యూఎస్ ఓపెన్‌లో ఇంత సుదీర్ఘమైన మ్యాచ్ జరగడం ఇదే మొదటిసారి. గతంలో స్టీఫన్ ఎడ్బర్గ్, మైఖేల్ చాంగ్ మధ్య 1992లో జరిగిన సెమీస్ మ్యాచ్ 5 గంటల 26 నిమిషాల పాటు సాగగా తాజాగా ఆ రికార్డు బద్దలైంది. కాగా తాజా పోరులో ఎవాన్స్ 6-7 (6/8), 7-6 (7/2), 7-6 (7/4), 4-6, 6-4తో కరెన్‌ను ఓడించాడు. మూడు ట్రై బ్రేకర్లు జరిగిన ఈ మ్యాచ్‌లో ఐదు సెట్లలో (68 నిమిషాలు, 67, 72, 67, 61) ఏ ఒక్క సెట్ కూడా గంట కంటే తక్కువ జరుగకపోవడం గమనార్హం.