World Championships : బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో దూసుకెళ్తున్న పీవీ సింధు (PV Sindhu) పోరాటం ముగిసింది. మహిళల సింగిల్స్‌లో పతకంపై ఆశలు రేపిన తెలుగు తేజం అనూహ్యగా క్వార్టర్ ఫైనల్లో ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఉత్కంఠగా సాగిన పోరులో తొమ్మిదో సీడ్ పుత్రి కుసుమ వర్దానీ(ఇండోనేషియా) చేతిలో ఐదుసార్లు ఛాంపియన్ అయిన సింధు ఓటమిపాలైంది. దాంతో.. మరోసారి మెగా టోర్నీలో టైటిల్ సాధించకుండానే సింధు ఇంటిదారి పట్టింది.
ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో జోరు చూపిస్తున్న సింధు క్వార్టర్ ఫైనల్లో చేతులెత్తేసింది. పదహారో రౌండ్లో రెండో సీడ్‌ను చిత్తు చేసిన ఒలింపిక్ విజేత.. ఇండోనేషియా షట్లర్ మర్దానీకి పోటీ ఇవ్వలేకపోయింది. తొలి సెట్లో ఆధిపత్యం చెలాయించిన వర్దానీ 21-14తో ముందంజ వేసింది. అయితే.. రెండో సెట్లో గొప్పగా పోరాడిన సింధు ప్రత్యర్ధికి షాకిస్తూ 21-13తో సెట్ గెలిచింది.
END OF CAMPAIGN FOR PV SINDHU! 💔
She lost to Wardani 14-21, 21-13, 16-21 in the Quarter of the Badminton World Championship!
Well Played! 👏 pic.twitter.com/MDX0Mxd6p0
— The Khel India (@TheKhelIndia) August 29, 2025
దాంతో, మ్యాచ్ మూడో సెట్‌కు వెళ్లింది. అయితే.. నిర్ణయాత్మక సెట్లో భారత షట్లర్ దూకుడుగా ఆడలేకపోయింది. ఫలితంగా 16-21తో సెట్‌తో పాటు సెమీఫైనల్ బెర్తును చేజార్చుకుంది సింధు. దాంతో, ఈ పోటీల్లో ఆరోసారి ఛాంపియన్‌గా నిలవాలనుకున్న ఆమె కలలు కల్లలయ్యాయి. ఈ టోర్నీలో భారత స్టార్ గతంలో ఒక స్వర్ణం, రెండు రజతాలు, రెండు కాంస్యాలు సాధించింది. జాంగ్ నింగ్ (చైనా) తర్వాత వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో అత్యధికంగా ఐదు పతకాలు గెలుపొందిన రెండో షట్లర్ సింధునే కావడం విశేషం.
మిక్స్డ్ డబుల్స్‌లోనూ తనీషా క్రాస్టో, ధ్రువ్ కపిల జోడీ కూడా ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించింది.
పదహారో రౌండ్లో ఐదో సీడ్ జంటపై సంచలన విజయంతో ఆశలు రేపిన ఈ జోడీ సైతం క్వార్టర్ ఫైనల్లోనే వెనుదిరిగింది. శుక్రవారం హోరాహోరీగా జరిగిన పోరులో నాలుగో సీడ్ జంట చెన్ తంగ్జీ, తో ఇవీ(మలేషియా) చేతిలో పరాజయం పాలైంది భారత ద్వయం. దాంతో, ఈ టోర్నీలో పతకం గెలిచిన మూడో భారత జంటగా రికార్డు నెలకొల్పే అవకాశాన్ని చేజార్చుకున్నారు తనీషా, ధ్రువ్.