డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ వేదికగా జరుగుతున్న 38వ నేషనల్ గేమ్స్‌లో తెలంగాణ పతక జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. మంగళవారం వేర్వేరు క్రీడా విభాగాల్లో తెలంగాణ ప్లేయర్లు నాలుగు పతకాలతో సత్తాచాటారు. మహిళల హెప్టాథ్లాన్ ఈవెంట్లో రాష్ట్ర స్టార్ అథ్లెట్ అగసర నందిని 5601 అగ్రస్థానంలో నిలిచి పసిడి పతకంతో మెరిసింది. మొత్తం ఏడు ఈవెంట్లతో ప్రత్యర్థులకు దీటైన పోటీనిస్తూ ముందుకు సాగిన నందిని నేషనల్ గేమ్స్‌లో రెండో పతకాన్ని ఖాతాలో వేసుకుంది.
పూజ (4999, హర్యానా), దీపిక(4939, తమిళనాడు) వరుసగా రజత, కాంస్య పతకాలు దక్కించుకున్నారు. మహిళల 200మీటర్ల రేసులో రాష్ర్టానికి చెందిన గాదె నిత్య 23.76 సెకన్ల టైమింగ్‌తో మూడో స్థానంలో నిలిచి కాంస్యం సొంతం చేసుకుంది. ఇదే కేటగిరీలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జ్యోతి యర్రాజీ (23.35సె), ఉన్నతి అయ్యప్ప (23.70సె, కర్నాటక) వరుసగా స్వర్ణ, రజత పతకాలు ఖాతాలో వేసుకున్నారు. నేషనల్ గేమ్స్‌లో జ్యోతికి ఇది రెండో స్వర్ణం కావడం విశేషం. మరోవైపు మహిళల జిమ్నాస్టిక్స్ ఆల్‌రౌండ్ వ్యక్తిగత విభాగంలో యువ జిమ్నాస్ట్ నిశిక అగర్వాల్ 44:767 స్కోరుతో కాంస్యం సొంతం చేసుకుంది. మహిళల నెట్‌బాల్ ఫాస్ట్5 ఫైనల్లో తెలంగాణ జట్టు 20-23తో హర్యానా చేతిలో ఓడి రజత విజేతగా నిలిచింది. ఓవరాల్‌గా ఇప్పటి వరకు తెలంగాణ 2 స్వర్ణాలు, 3 రజతాలు, 8 కాంస్యాలతో 27వ స్థానంలో కొనసాగుతున్నది.