IND Vs SA T20 |భారత్-దక్షిణాఫ్రికా మధ్య మంగళవారం నుంచి టీ20 సిరీస్ మొదలుకానున్నది. ఐదు మ్యాచుల సిరీస్‌లో తొలి మ్యాచ్ కటక్ వేదికగా జరుగనున్నది. ఈ మ్యాచ్‌కు ముందు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీమ్ సెలక్షన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. టెస్టు, వన్డే సిరీస్‌కు దూరమైన శుభ్‌మన్ గిల్ టీ20 జట్టులో చోటు దక్కింది. అయితే, కటక్ టీ20లో శుభ్‌మన్ గిల్‌ను ఓపెనర్‌గా ఆడించనుండగా.. శాంసన్‌ను మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో శాంసన్‌ను బ్యాటింగ్ ఆర్డర్ మార్పుపై వస్తున్న విమర్శలపై టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ స్పందించాడు. ఈ నిర్ణయం కేవలం ఫామ్ ఆధారంగా కాకుండా.. జట్టు కూర్పు, గిల్ పునరాగమనం ఆధారంగా తీసుకున్నట్లు తెలిపాడు.
ఆసియా కప్‌లో దాదాపు ఒక సంవత్సరం తర్వాత శుభ్‌మాన్ గిల్ టీ20 ఫార్మాట్లో తిరిగి వచ్చాడు. టీమ్ మేనేజ్మెంట్ గిల్‌ను ఆల్ ఫార్మాట్ స్టార్‌గా భావిస్తున్నది. ఈ క్రమంలో గిల్ టీ20 జట్టులోకి తీసుకొని.. ఓపెనింగ్ బాధ్యతలను అప్పగించారు. సంజు విషయానికి వస్తే జట్టులోకి వచ్చిన సమయంలో టాప్ ఆర్డర్లో బ్యాటింగ్ చేశాడు. సంజు శాంసన్ జట్టులోకి కొత్తగా వచ్చిన సమయంలో టాప్ ఆర్డర్లో ఆడాడని.. ఓపెనర్‌గానూ మెరుగ్గా రాణించాడని తెలిపాడు. అయితే, శుభ్‌మన్ గిల్ శ్రీలంక సిరీస్‌లో సంజు కంటే ముందే ఓపెనర్‌గా ఆడాడని.. కాబట్టి ఆ స్థానం అతనికే దక్కడం న్యాయమని సూర్యకుమార్ చెప్పుకొచ్చాడు.
టీ20 ఫార్మాట్లో ఓపెనర్లు మినహా మిగతా బ్యాటర్లు అందరూ ఏ స్థానంలోనైనా ఆడేందుకు సిద్ధంగా ఉండాలన్నాడు. తాము శాంసన్‌కు సరైన అవకాశాలు ఇచ్చామని.. ప్రస్తుతం మూడు నుంచి ఆరు వరకు ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేసేందుకు రెడీ ఉన్నాడని తెలిపారు. జట్టు అవసరాలకు తగ్గట్టుగా సౌలభ్యం ఉండడం చాలా ముఖ్యమని తెలిపాడు సూర్యకుమార్. గాయం నుంచి కోలుకున్న పాండ్యా తిరిగి జట్టులో చేరడంతో మరింత అదనపు బలాన్ని ఇస్తుందన్న సూర్య.. అతని అనుభవం, కొత్తతో బంతితో బౌలింగ్ చేయగల సామర్థ్యం జట్టుకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పాడు.
త్వరలో జరుగనున్న ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకుని జట్టులో ప్లేయర్లు ఏ స్థానంలోనైనా ఆడేందుకు రెడీ ఉండాలన్న సూర్య.. బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు సహజమేనని చెప్పుకొచ్చాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో జరుగనున్న టీ20 ప్రంపచకప్‌కు ముందు భారత్ పది టీ20లు ఆడనున్నది. ప్రస్తుతం జట్టు ప్రస్తుతం పెద్దగా మార్పులు చేసేందుకు ఇష్టపడడం లేదని, ప్రపంచకప్‌కి ముందు జట్టును అన్నిరకాలుగా తీర్చిదిద్దడంపైనే దృష్టి పెట్టినట్లుగా సూర్య తెలిపారు. రాబోయే సిరీస్‌లోనూ పెద్దగా మార్పులు చేయాలనుకోవడం లేదని.. ఎలాంటి క్రికెట్ ఆడాలనుకుంటున్నామో.. ప్రతీ సిరీస్‌కు ముందు అంచనా వేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పాడు.