Rohit Sharma : క్రీజులో అడుగుపెట్టడమే ఆలస్యం రోహిత్ శర్మ(Rohit Sharma) తన బ్యాటింగ్ విన్యాసాలతో ప్రత్యర్థులకు నిద్రలేని రాత్రులు మిగిల్చుతాడు. అయితే.. హిట్‌మ్యాన్‌లో మనకు తెలియని మరో కోణం కూడా ఉందట. ప్రస్తుతం రెండు ఫార్మాట్లలో టీమ్ఇండియా కెప్టెన్‌గా కొనసాగుతున్న రోహిత్ గురించి ఓపెనర్ శుభ్‌మన్ గిల్(Shubman Gill) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వన్డే క్రికెట్లో మరే ప్లేయర్‌కు సాధ్యం కాని రీతిలో మూడు డబుల్ సెంచరీ(Double Century)లు తన పేరిట లిఖించుకున్న రోహిత్.. డ్రెస్సింగ్ రూమ్‌లో డ్యాన్స్ చేస్తాడని గిల్ వెల్లడించాడు. త్వరలోనే హిట్‌మ్యాన్ డ్యాన్స్ చేసిన రీల్ చూసే అవకాశం ఉందని గిల్ పేర్కొన్నాడు.
ఈరోజు ముంబైలో జరిగిన సియట్ 25వ క్రికెట్ అవార్డు(CEAT Cricket Ratings)ల కార్యక్రమంలో గిల్ ఈ వ్యాఖ్యలు చేశాడు. మూడు ఫార్మాట్లలో నిలకడగా రాణిస్తున్న గిల్ ‘సియట్ మెన్స్ ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’, ‘సియట్ ఇంటర్నేషనల్ బ్యాటర్ ఆఫ్ ది ఇయర్’, ‘సియట్ వన్డే బ్యాటర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డులు కైవసం చేసుకున్నాడు. ఈ సందర్భంగా గిల్ మాట్లాడుతూ.. ‘కోచ్, కెప్టెన్ తనపై నమ్మకం ఉంచడం వల్లే తన కెరీర్ సాఫీగా సాగుతున్నదని పేర్కొన్నాడు.
‘డబుల్ సెంచరీ చేసి ఊపులో ఉన్న ఇషాన్ కిషన్(Ishan Kishan)ను పక్కన పెట్టి నాకు చాన్స్ ఇవ్వడం చాలా సాహసమే. వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటా. రోహిత్ భాయ్‌లో మీకు తెలియని మరో కోణం ఉంది. అతడు మంచి డ్యాన్సర్. త్వరలోనే మీరంతా రోహిత్ భాయ్ నృత్యం చూస్తారు’ అని గిల్ పేర్కొన్నాడు.
సియట్ అవార్డుతో శుభ్‌మన్ గిల్
భారత జట్టులో విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, శిఖర్ ధవన్ వంటి ప్లేయర్లు గతంలో ఎన్నోసార్లు డాన్స్ చేస్తూ దర్శనమిచ్చినా.. రోహిత్ మాత్రం పెద్దగా కాలు కదిపింది లేదు. అలాంటిది.. రోహిత్లో మంచి డ్యాన్సర్ ఉన్నాడని గిల్ చెప్పడంతో అతడి స్పెషల్ రీల్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.