IND vs AUS : బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ (Border – Gavaskar Trophy) ఆఖరి టెస్టులో టీమిండియా ధీటుగా బదిలిస్తోంది. సూపర్ ఫామ్‌లో ఉన్న యంగ్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (128) శతకంతో మెరిశాడు. స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ (59) హాఫ్ సెంచరీ బాదాడు. దాంతో, మూడో రోజు ఆట ముగిసే సరికి భారత్ 3 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది.
ఆస్ట్రేలియా బౌలర్లలో లియన్, మర్ఫీ, కుహేమాన్ తలా ఒక వికెట్ పడగొట్టారు. ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులు వెనకబడి ఉంది. నాలుగో రోజు భారత్ భారీ స్కోర్ చేస్తే, ఆసీస్‌ను ఒత్తిడిలోకి నెట్టే అవకాశం ఉంది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 480 రన్స్‌కు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే.
యంగ్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్, జట్టు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడుతూ శతకం సాధించాడు. రోహిత్ శర్మ(35) రెండో రోజు త్వరగా ఔట్ కావడంతో పూజారా(42)తో కలిసి స్కోర్‌బోర్డును పరుగులు పెట్టించాడు. ఆసీస్ స్పిన్ త్రయం లియాన్, మర్ఫీ, కుహేమాన్లను ధీటుగా ఎదుర్కొన్నాడు. బ్యాటింగ్‌కు అనుకూలించిన పిచ్‌పై అతను తన క్లాస్ ఆట చూపించాడు. గిల్ టెస్టుల్లో రెండో శతకం సాధించాడు. పూజారాతో మూడో వికెట్‌కు 58 పరుగులు జోడించాడు. 235 బంతుల్లో 128 రన్స్ చేసి ఔట్ అయ్యాడు. అతని ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి.
శుభ్‌మన్ వెనుదిరిగాక.. విరాట్ కోహ్లీ (Virat Kohli), జడేజా (Ravindra Jadeja) ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యత తీసుకున్నారు. అప్పటికీ ఆట 15 ఓవర్లు మిగిలి ఉండడంతో జాగ్రత్తగా ఆడారు. ఆత్మవిశ్వాసంతో ఆడిన కోహ్లీ 14 నెలలల తర్వాత ఈ ఫార్మాట్లో తొలి ఫిఫ్టీ కొట్టాడు. 128 బంతులు ఎదుర్కొన్న అతను 59 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. కోహ్లీ, జడేజా.. జోడీని విడదీసేందుకు కెప్టెన్ స్టీవ్ స్మిత్ కొత్త బంతి తీసుకున్నా ఫలితం లేకపోయింది.