ప్రస్తుతం టీమిండియాలో కెప్టెన్సీ సమస్య తాత్కాలికంగా తీరినప్పటికీ.. భవిష్యత్తులో జట్టు పగ్గాలు ఎవరికి అందించాలనే విషయంపై తర్జనభర్జనలు కొనసాగుతున్నాయి. కోహ్లీ నుంచి అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీని తీసుకున్న రోహిత్ శర్మ మహా అయితే వన్డే ప్రపంచకప్ వరకు భారత్‌కు సారధ్యం వహిస్తాడు. ఆ తర్వాత అయినా మరో కెప్టెన్ కావలసిందే.
ఈ రేసులో కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, రిషభ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ ఉన్నారు. వీరిలో శ్రేయాస్ అయ్యర్ తన సత్తా అద్భుతంగా నిరూపించుకుంటున్నాడని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ అభిప్రాయపడ్డారు. 2020లో తొలిసారి ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఐపీఎల్ ఫైనల్స్‌కు తీసుకెళ్లినా.. కప్ సాధించలేకపోయిన అయ్యర్‌ను ఆ ఫ్రాంచైజీ రిటైన్ చేసుకోలేదు.
దీంతో కోల్‌కతా బస్సు ఎక్కేసిన శ్రేయాస్.. కెప్టెన్‌గా మంచి మార్కులే కొట్టేశాడు. మూడు మ్యాచుల్లో రెండు విజయాలతో రాణిస్తున్నాడు. అతను బ్యాటుతో కూడా రాణించాలని, జట్టును ముందుండి నడిపించాలని అక్తర్ సూచించాడు. ఇలా చేయడం వల్ల టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ రేసులో అయ్యర్‌ను సీరియస్‌గా తీసుకుంటారని సలహా ఇచ్చాడు.