Shreyas Iyer : దేశవాళీ క్రికెట్లో పాపులర్ అయిన రంజీ ట్రోఫీలో భారత జట్టు స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) రెచ్చిపోతున్నాడు. గత సీజన్లో విఫలమైన అయ్యర్ ఈసారి వరుస సెంచరీలతో కదం తొక్కుతున్నాడు. ముంబై తరఫున వరుసగా రెండు మ్యాచుల్లో శతక గర్జన చేసిన అయ్యర్ సెలెక్టర్లకు సవాల్ విసిరుతున్నాడు. మహరాష్ట్రపై రాణించిన అయ్యర్.. బుధవారం ఒడిశా బౌలింగ్ యూనిట్‌పై విరుచుకుపడి వంద కొట్టేశాడు.
మహారాష్ట్రపై సెంచరీతో (142 పరుగులు) ఫామ్‌లోకి వచ్చిన అయ్యర్ ఒడిశా బౌలర్లకు చుక్కలు చూపించాడు. బౌండరీలతో విధ్వంసం సృష్టిస్తూ 101 బంతుల్లోనే మూడంకెల స్కోర్ అందుకున్నాడు. సెంచరీ తర్వాత కూడా జోరు చూపిన అతడు 152 పరుగులతో నాటౌట్‌గా నిలిచి.. తొలి డబుల్ సెంచరీ దిశగా దూసుకెళ్లుతున్నాడు. సిద్దేశ్ లాడ్(116)తో పాటు ఓపెనర్ అంగ్క్రిష్ రఘువంశీ(92)లు సైతం దంచడంతో ముంబై తొలి రోజు 385/3తో పటిష్ట స్థితిలో నిలిచింది.
The Hundred Celebration by Shreyas Iyer. 🥶❤️ pic.twitter.com/Qd6S6LcV5n
— Zaid 🌟 (krxsiaesthetics) (@KnightRidersfam) November 6, 2024
ఈఏడాది ఆరంభంలో సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయిన శ్రేయస్ అయ్యర్ టెస్టు జట్టులో చోటు కోసం శ్రమిస్తున్నాడు. అయితే.. దులీప్ ట్రోఫీ.. ఆపై ఇరానీ కప్‌లో పెద్దగా రాణించకపోవడంతో సెలెక్టర్లు అతడికి షాకిచ్చారు. దాంతో, ఆస్ట్రేలియా గడ్డపై నవంబర్‌లో జరుగబోయే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అతడి పేరు లేదు. పైగా.. ఐపీఎల్ 18వ సీజన్ ముందు మెగా వేలం ఉంది. ఒకే దెబ్బకు ఇటు టెస్టు జట్టులోకి రావడంతో పాటు వేలంలో రికార్డు ధర పలకాలని భావిస్తున్న అయ్యర్ తన బ్యాట్ పవర్ చూపిస్తూ వరుస సెంచరీలతో చెలరేగుతున్నాడు.
ఐపీఎల్ 17వ సీజన్లో అయ్యర్ సారథ్యంలోని కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ట్రోఫీని అందుకుంది. ఏకపక్షంగా సాగిన ఫైనల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను చిత్తుగా ఓడించిన కేకేఆర్ మూడోసారి చాంపియన్‌గా అవతరించింది. అయితే.. 18వ సీజన్లో జట్టుతో కొనసాగేందుకు అయ్యర్ భారీగా డబ్బులు డిమాండ్ చేయడంతో అతడిని ఫ్రాంచైజీ వదులుకుంది.
🚨📰| As TOI reported last week, KKR had their first talks with Shreyas just three days before the IPL retention deadline. Before the October 27 chat, no one at KKR had contacted the player who had led them to their third IPL title. pic.twitter.com/ocgWeT42j7
— Pick-up Shot (@96ShreyasIyer) November 6, 2024
దాంతో, అతడు ఈసారి మెగా వేలంలో రూ.2 కోట్ల కనీస ధరకు పేరు రిజిష్టర్ చేసుకున్నాడు. రంజీల్లో సెంచరీలతో ఫామ్ అందుకున్న అయ్యర్ అత్యధిక ధర పలికే వీలుందని విశ్లేషకులు అంటున్నారు. ఐపీఎల్ మెగా వేలం సౌదీ అరేబియాలోని జెడ్డా నగరంలో నవంబర్ 24, 25వ తేదీల్లో జరుగనుంది.