పారిస్: ఒలింపిక్స్ తాజా ఎడిషన్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన షూటర్ మను భాకర్ మరో కాంస్యంపై గురిపెట్టింది. సోమవారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ క్వాలిఫికేషన్ ఈవెంట్లో మను, సరబ్‌జ్యోత్ సింగ్ ద్వయం మూడో స్థానంలో నిలిచి క్వార్టర్స్ పోరుకు అర్హత సాధించింది. క్వాలిఫికేషన్ రౌండ్లో మను, సరబ్‌జ్యోత్ జోడీ.. 580 (20 షాట్లలో) పాయింట్లు స్కోరు చేసి పతక రేసులోకి వచ్చింది. నాలుగో స్థానంలో నిలిచిన దక్షిణ కొరియా (579 పాయింట్లు)తో క్వార్టర్స్‌లో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. 18 షాట్లలో 582 పాయింట్లు స్కోరు చేసిన టర్కీ అగ్రస్థానంలో నిలవగా 24 షాట్లలో 581 పాయింట్లు సాధించిన సెర్బియా స్వర్ణ, రజత పోరు కోసం తలపడతాయి.
ఇదే ఈవెంట్లో బరిలో నిలిచిన మరో భారత ద్వయం రిథమ్ సంగ్వాన్, అర్జున్ సింగ్ పదో స్థానంతో పతక రేసు నుంచి నిష్క్రమించారు. మంగళవారం జరిగే మెడల్ ఈవెంట్లో గనక పతకం గెలిస్తే మను భాకర్ చరిత్ర సృష్టించినట్టే. భారత ఒలింపిక్ చరిత్రలో ఇప్పటిదాకా రెండు పతకాలు గెలిచినవారిలో సుశీల్ కుమార్ (రెజ్లర్), పీవీ సింధు (బ్యాడ్మింటన్)మాత్రమే ఉండగా వాళ్లిద్దరూ వేర్వేరు ఎడిషన్లలో మెడల్స్ కొట్టారు. ఒకే ఎడిషన్‌లో రెండు పతకాలు సాధించిన క్రీడాకారులైతే ఎవరూ లేరు. 1900లో నార్మన్ ప్రిచర్డ్ భారత్ తరఫున ఆడుతూ ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు నెగ్గినా ఆయన బ్రిటన్ దేశస్థుడు. మరి మన మను ఏం చేసేనో!