అంతర్జాతీయ వేదికలపై తెలంగాణ క్రీడా తారలు తళుక్కున మెరుస్తున్నాయి. తాము ఎంచుకున్న విభాగంలో సత్తాచాటుతూ పతకాల పంట పండిస్తున్నారు. అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో అవరోధాలు ఎదురైనా వెరవకుండా ముందుకుసాగుతూ దేశ, రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపజేస్తున్నారు. ఇప్పుడు ఇదే కోవలో రాష్ట్ర యువ షూటర్ రాపోలు సురభి భరద్వాజ్ చేరింది. సరిగ్గా ఏడేండ్ల క్రితం షూటింగ్‌ను కెరీర్‌గా ఎంచుకున్న ఈ హైదరాబాదీ అనతికాలంలోనే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తాచాటుతున్నది. జర్మనీ వేదికగా తాజాగా ముగిసిన జూనియర్ షూటింగ్ ప్రపంచకప్‌లో సురభి వెండి వెలుగులు విరజిమ్మింది. 50మీటర్ల ప్రోన్ విభాగంలో తెలంగాణ తరఫున మెగాటోర్నీలో పతకం సాధించిన తొలి మహిళా షూటర్‌గా నిలిచింది. ఏస్ షూటర్ గగన్ నారంగ్ దగ్గర శిక్షణ తీసుకుంటున్న ఈ హైదరాబాదీ భవిష్యత్‌లో ఆసియా గేమ్స్, ఒలింపిక్స్ లాంటి మెగా
టోర్నీల్లో పతకం సాధించడమే తన లక్ష్యమంటున్నది. ఆర్థిక సాయమందిస్తే రాష్ట్రం తరఫున మరిన్ని పతకాలు కొల్లగొడుతానని ధీమా వ్యక్తం చేసిన సురభితో ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక ఇంటర్వ్యూ.
ప్రపంచకప్‌లో పతకంపై మీ స్పందన?
బరిలోకి దిగిన తొలి అంతర్జాతీయ టోర్నీలో పతకం సాధించడం చాలా సంతోషంగా ఉంది. వివిధ దేశాల నుంచి వచ్చిన టాప్ షూటర్లతో తీవ్ర పోటీని ఎదుర్కొన్నాను. కోచ్‌లు చెప్పిన విధంగా ఎలాంటి ఒత్తిడి, తడబాటుకు లోనుకాకుండా ఆటపై దృష్టి సారిస్తూ ముందుకు సాగాను. మిగతా విభాగాల కంటే వైవిధ్యంగా ఉండే 50 మీటర్ల ప్రోన్‌లో గగన్ నారంగ్ తర్వాత పతకం గెలిచిన షూటర్‌గా నిలువడం గర్వంగా ఉంది. రౌండ్ రౌండ్‌కు స్కోరును మెరుగుపర్చుకుంటూ తుదిపోరుకు అర్హత సాధించాను. ఈ క్రమంలో ప్రత్యర్థుల నుంచి దీటైన పోటీ ఎదురైనా వెనకకు తగ్గలేదు. ఫైనల్లో 621.9 పాయింట్లతో రజతం గెలిచాను.
మెగాటోర్నీకి ఎలా సిద్ధమయ్యారు?
జర్మనీలో జరిగిన షూటింగ్ ప్రపంచకప్ కోసం వివిధ దశల్లో అర్హత టోర్నీలు నిర్వహించారు. భోపాల్‌లో గతేడాది నవంబర్-డిసెంబర్లో నిర్వహించిన 64వ జాతీయ షూటింగ్ చాంపియన్‌షిప్ 50మీటర్ల రైఫిల్ ప్రోన్ విభాగంలో రజతం సాధించాను. ఇందులో పతకంతో పాటు జాతీయ స్థాయి రికార్డు(623.7)తో ప్రపంచకప్ టోర్నీకి భారత జట్టుకు ఎంపికయ్యాను. భోపాల్ కంటే ముందు ఢిల్లీ, తిరువనంతపురంలో జరిగిన వేర్వేరు అర్హత టోర్నీల్లో మెరుగైన ప్రదర్శన కనబర్చడం కలిసొచ్చింది.
సురభి సాధించిన పతకాలు
జూనియర్ షూటింగ్ ప్రపంచకప్‌లో రజతం (2022)
64వ జాతీయ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో రజతం (2021)
ప్రి నేషనల్స్ టోర్నీలో రజతం (2017)
సౌత్‌జోన్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో రజతం (2017)
రాష్ట్ర స్థాయి షూటింగ్ టోర్నీలో స్వర్ణ పతకం (2017)
ఎన్సీసీ షూటింగ్ టోర్నీలో రజత పతకం (2015)
భవిష్యత్ లక్ష్యాలేంటి?
షూటింగ్ ప్రపంచకప్‌లో పతకం గెలువడం ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం ఘనంగా చేశాను. ఇదే ఒరవడిని రానున్నమేజర్ టోర్నీల్లోనూ కొనసాగించాలనుకుంటున్నాను. అందుకు తగ్గట్లు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతాను. కోచ్ నారంగ్ పర్యవేక్షణలో టోర్నీ టోర్నీకి మెరుగవుతూ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాలన్న పట్టుదలతో ఉన్నాను. జూలైలో జరిగే బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో షూటింగ్ అంశం లేకపోయినా..ఆసియా గేమ్స్‌కు అర్హత సాధించేందుకు పోటీపడ్డ ప్రతీ టోర్నీ ద్వారా ర్యాంకింగ్స్‌ను మెరుగుపర్చుకోవాలన్న కసితో ఉన్నాను.
చదువు, కెరీర్ సమన్వయం ఎలా?
చదువుతో పాటు షూటింగ్ కెరీర్‌ను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాను. ఉస్మానియా యూనివర్సి టీలో ప్రస్తుతం బీఈ మూడో సంవత్సరం చదువుతున్న నేను.. అధ్యాపకుల సహకారంతో అటు చదువుతో పాటు టోర్నీల్లో రాణిస్తున్నాను. ఇంజినీరింగ్ కంటే ముందుగానే కెరీర్ మొదలుపెట్టినా ఇంటర్మీడియట్లో కొన్ని అవంతరాలు ఎదురయ్యాయి. అయినా షూటింగ్ విడిచిపెట్టకుండా కొనసాగిస్తున్నాను. రోజు ఉదయం మేముంటున్న నాగోల్ నుంచి గచ్చిబౌలి గగన్ నారంగ్ అకాడమీకి ప్రయాణం చేస్తుంటాను. ఈ క్రమంలో మెట్రో రైలు, బస్సు, ఆటోలు ఇలా గమ్యాన్ని చేరుకోవడానికి ప్రయాస పడుతుంటున్నాను. షూటింగ్‌పై ఉన్న మక్కువతో సొంత గన్ లేకపోయినా అకాడమీ వాళ్లు ఇచ్చిన దాంతో టోర్నీల్లో పాల్గొంటున్నాను. మధ్య తరగతి కుటుంబానికి చెందిన మేము లక్షలు ఖర్చు పెట్టి గన్ కొనే స్థోమత లేదు. ఎవరైనా దాతలు ముందుకొచ్చి సాయం చేస్తే భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధిస్తానన్న నమ్మకముంది. దీనికి తోడు అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న నాకు ప్రభుత్వం అండగా నిలిస్తే రాష్ట్ర ఖ్యాతిని మరింతగా ఇనుమడింపజేస్తాను.