IPL 2025 : క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న ఐపీఎల్ 18 సీజన్ ప్రారంభ వేడుకలు ఘనంగా జరిగాయి. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో సినీ తారలు, క్రికెట్ స్టార్లు.. ఆరంభ వేడుకల సంబురాన్ని అంబరాన్నంటేలా చేశారు. మొదటగా గాయని శ్రేయా ఘోషల్, పంజాబీ సింగర్ కరన్ హౌజ్లా తమ పాటలతో ఉర్రూతలూగించారు. వీళ్లు ఆలపిస్తుంటే స్టేడియం మొత్తం హోరెత్తిపోయింది. ఈ ఇద్దరి సంగీత ప్రదర్శన తర్వాత మైక్ అందుకున్న బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్(Sharukh Khan) తన యాంకరింగ్‌తో ఫ్యాన్స్‌ను అలరించాడు.
తమ ఫ్రాంచైజీ ఆటగాడు రింకూ సింగ్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మాజీ సారథి విరాట్ కోహ్లీలతో కలిసి స్టెప్పులు వేసిన బాద్షా అభిమానుల్లో జోష్ మరింత పెంచాడు. ఆ కాసేపటికి బీసీసీఐ (BCCI) అధ్యక్షుడు రోజర్ బిన్ని, సెక్రటరీతో పాటు ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్.. కుర్ర హృదయాల్లో కొలువైన దిశా పటానీని వేదికపైకి ఆహ్వానించాడు షారుక్.
King Khan 🤝 King Kohli
When two kings meet, the stage is bound to be set on fire 😍#TATAIPL 2025 opening ceremony graced with Bollywood and Cricket Royalty 🔥#KKRvRCB | @iamsrk | @imVkohli pic.twitter.com/9rQqWhlrmM
— IndianPremierLeague (@IPL) March 22, 2025
బాణాసంచా వెలుగుల మధ్య డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్.. కెప్టెన్ అజింక్యా రహానే, ఆర్సీబీ సారథి రజత్ పాటిదార్ ట్రోఫీనీ వేదిక మీదకు తీసుకొచ్చారు. అనంతరం ఐపీఎల్ 18వ ఎడిషన్‌కు గుర్తుగా.. భారీ కేకును కోశారు. జాతీయ గీతం జనగణమన ఆలపించి.. వేడుకను ముగించారు. మరికాసేపట్లో అభిమానులతో కిక్కిరిసిన ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా, బెంగళూరు జట్ల మధ్య తొలి సమరం జరుగనుంది.