ముంబై : ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ జట్టును .. అమెరికాకు చెందిన కల్ సోమానీ సుమారు 15,290 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఫ్రాంచైజీలోని వంద శాతం వాటాను సోమానీ సొంతం చేసుకున్నారు. అయితే రాజస్థాన్ రాయల్స్‌కు తొలి సీజన్లో ఆస్ట్రేలియా స్పిన్ లెజండ్ షేన్ వార్న్(Shane Warne) కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. ఆర్ఆర్తో డీల్ కుదుర్చుకున్న సమయంలో ఆ ఫ్రాంచైజీలో కొంత వాటా కూడా తీసుకున్నారు. 2008 సీజన్లో షేన్ వార్న్ ప్రదర్శించిన ముందుచూపు.. ఇప్పుడు ఆయన కుటుంబసభ్యులకు వరాల జల్లు కురిపించనున్నది.
దాదాపు రెండు దశాబ్ధాల తర్వాత వార్న్ ఫ్యామిలీకి బంపర్ రివార్డు అందనున్నది. రాజస్థాన్ జట్టుతో షేన్ వార్న్ డీల్ చేసుకున్న సమయంలో.. ఆ ఫ్రాంచైజీలో ప్రతి ఏడాది 0.75 శాతం వాటా ఓనర్షిప్ కూడా కుదుర్చుకున్నాడు. ఆడిన ప్రతి సంవత్సరం ఆ వాటా రావాలన్నారు. నాలుగేళ్ల పాటు వార్న్ ఆ జట్టు తరపున ఆడాడు. ఈ లోగా ఆ వాటా 3 శాతానికి పెరిగింది. అయితే ప్రస్తుతం ఆ ఫ్రాంచైజీని సోమానీ సుమారు 1.63 బిలియన్ల డాలర్లకు సొంతం చేసుకోవడం వల్ల అతని వాటా కింద సుమారు 460 కోట్లు దక్కే అవకాశాలు ఉన్నాయి.
ఐపీఎల్ 2026 ఎడిషన్ ముగిసిన తర్వాత షేన్ వార్న్ ఫ్యామిలీ ఆ వాటాను అమ్ముకునేందుకు అర్హత ఉంటుంది. ఆ సేల్ ద్వారా వచ్చే డబ్బు వార్న్ ఫ్యామిలీకి దక్కుతుంది. అయితే ఈ డీల్‌కు బీసీసీఐ అనుమతి తప్పనిసరి అని తెలుస్తోంది. ఎమర్జింగ్ మీడియాకు చెందిన మనోజ్ బద్లే సుమారు 67 మిలియన్ల డాలర్లకు 2008లో ఫ్రాంచైజీని కొనుగోలు చేశారు. స్పిన్ లెజెండ్ షేన్ వార్న్ 2022లో అకస్మాత్తుగా మృతిచెందిన విషయం తెలిసిందే.