Shamar Joseph: సుమారు రెండున్నర దశాబ్దాల తర్వాత ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాను ఓడించడంలో కీలక పాత్ర పోషించిన వెస్టి్ండీస్ యువ పేస్ సంచలనం షెమర్ జోసెఫ్‌కు ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. గబ్బా వేదికగా గత నెలలో ఆసీస్‌తో జరిగిన టెస్టులో షెమర్.. రెండో ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు తీయడమే గాక సిడ్నీ టెస్టులో కూడా అంచనాలకు మించి రాణించాడు. గత నెలలో షెమర్ జోసెఫ్ ప్రదర్శనలకు గాను అతడు జనవరి నెలకు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు గెలుచుకున్నాడు. ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ ఓలీ పోప్, ఆసీస్ పేస్ బౌలర్ జోష్ హెజిల్‌వుడ్‌లను వెనక్కినెట్టి జోసెఫ్ ఈ అవార్డు సొంతం చేసుకోవడం విశేషం.
జనవరి నెలలో సిడ్నీ వేదికగా జరిగిన తొలి టెస్టులో విండీస్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన జోసెఫ్.. టెస్టులలో తొలి వికెట్ ప్రఖ్యాత బ్యాటర్ స్టీవ్ స్మిత్‌ది దక్కించుకోవడం గమనార్హం. తొలి ఇన్నింగ్స్‌లోనే ఐదు వికెట్లు తీయడమే గాక 51 పరుగులు (36, 15) చేశాడు. ఇక గబ్బాలో అయితే రెండో ఇన్నింగ్స్‌లో అతడు బ్యాటింగ్ చేస్తుండగా మిచెల్ స్టార్క్ వేసిన బంతి అతడి కాలికి బలంగా తాకింది. గాయం వేధిస్తున్నా మరుసటి బౌలింగ్‌కు వచ్చిన ఈ కుర్రాడు.. ఆస్ట్రేలియాను వణికించాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా ఏడు వికెట్లు పడగొట్టి విండీస్‌కు సంచలన విజయాన్ని అందించాడు.
West Indies young sensation Shamar Joseph won ICC Player Of The Month award for January 2024. pic.twitter.com/52j8INyvuf
— Don Cricket 🏏 (@doncricket_) February 13, 2024
ఈ విజయంతో షెమర్ ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. షెమర్ గబ్బా ప్రదర్శన తర్వాత పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)తో పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో లక్నో సూపర్ జెయింట్స్ కాంట్రాక్టును దక్కించుకున్నాడు. ఇటీవలే లక్నో జట్టు.. రూ. 3.6 కోట్లతో షెమర్ను జట్టులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఎంట్రీ ఇచ్చి నెల రోజులు కాకముందే సంచలనాలతో దూసుకుపోతున్న షెమర్ రాబోయే రోజుల్లో ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి..