Shamar Joseph : అరంగేట్రం సిరీస్‌లోనే క్రికెట్ ప్రంచాన్ని నివ్వెరపరిచిన వెస్టిండీస్ యువ ఫాస్ట్ బౌలర్ షమర్ జోసెఫ్(Shamar Joseph) టీ20 లీగ్స్‌లోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ గబ్బా టెస్టు హీరో పాకిస్థాన్ సూపర్ లీగ్( Pakistan Super League)లో ఆడేందుకు ఓకే చెప్పాడు. పెషావర్ జల్మీ(Peshawar Zalmi) జట్టుతో 24 ఏండ్ల పేసర్ ఒప్పందం చేసుకున్నాడు.
గస్ అట్కిన్సన్ (Gus Atkinson)స్థానంలో కొన్ని మ్యాచ్‌లకు షమర్‌ను తీసుకున్నట్టు పెషావర్ మేనేజ్మెంట్ వెల్లడించింది. ఆ తర్వాత షమర్ అబూదాబీ వేదికగా జరిగే ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో దుబాయ్ క్యాపిటల్స్ తరఫున బరిలోకి దిగనున్నాడు.
Off the back of his heroics, rising star ⭐ Shamar Joseph joins the fray for HBL PSL 9 🎊#HBLPSL9 pic.twitter.com/DZhTqVwRgg
— PakistanSuperLeague (@thePSLt20) January 29, 2024
గయానాలోని మారుమూల ఊరిలో పుట్టి పెరిగిన షమర్ జోసెఫ్ క్రికెటర్ అయ్యేందుకు ఎన్నో కష్టాలు పడ్డాడు. ఆర్ధిక ఇబ్బందుల కారణంగా కొన్నాళ్లు సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేశాడు. అయితే.. గయానా మాజీ క్రికెటర్ చొరవతో ఆ ఉద్యోగం మానేసి న్యూ అమ్స్టర్డామలోని క్రికెట్ క్లబ్లో చేరాడు. అక్కడితో అతడి దశ తిరిగిపోయింది. ఫస్ట్ క్లాస్ అనుభవం ఏడాది కూడా లేని అతడు ఆస్ట్రేలియన్లకు చుక్కలు చూపించాడు.
తొలి టెస్టులోనే ఐదు వికెట్లతో తన పేస్ పవర్ చూపించిన షమర్.. గబ్బా స్టేడియంలో జరిగిన పింక్‌బాల్ (Pink Ball) టెస్టులో నిప్పులు చెరిగాడు. పేస్‌కు, స్వింగ్‌ను జోడించి కంగారూ బ్యాటర్లను వణికించాడు. మూడో రోజు మిచెల్ స్టార్క్ విసిరిన యార్కర్ షమర్ కాలి బొటనవేలికి గట్టిగా తాకింది. దాంతో రిటైర్డ్ హర్ట్‌గా మైదానం వీడిన అతడు నాలుగో రోజు జట్టును గెలిపించాలనే కసితో బంతి అందుకున్నాడు. అనుకున్నట్టుగానే ఆసీస్ టాపార్డర్‌ను కూల్చాడు.
ఒకే ఓవర్లో డేంజరస్ షాన్ మార్ష్, ట్రావిస్ హెడ్లను బౌల్డ్ చేసి విండీస్‌ను గెలుపు వాకిట నిలిపాడు. చివరి వికెట్‌గా క్రీజులోకి వచ్చిన హేజిల్‌వుడ్‌ను బౌల్డ్ చేసి గబ్బాలో చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో 8 వికెట్లు తీసినందుకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, మొత్తంగా రెండు మ్యాచుల్లో 13 వికెట్లు కూల్చినందుకు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు అందుకున్నాడు.