గుండె పనితీరుపై టైప్-2 డయాబెటిస్ తీవ్రమైన ప్రభావం చూపుతున్నదట. దీర్ఘకాలంలో గుండె ఆగిపోయే ప్రమాదాన్ని కూడా పెంచుతున్నదట. మానవ హృదయ నిర్మాణాన్ని కూడా డయాబెటిస్ ప్రభావితం చేస్తుందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. ఆస్ట్రేలియాలోని సిడ్నీ విశ్వవిద్యాలయ పరిశోధకులు, తాజాగా ఓ అధ్యయనం నిర్వహించారు. ఇందులో భాగంగా దానంచేసిన మానవ హృదయాలపై పలు పరిశోధనలు చేశారు. గుండె కణాలు శక్తిని ఉత్పత్తి చేసే విధానానికి మధుమేహం తీవ్రమైన అంతరాయం కలిగిస్తుందని, కండరాల నిర్మాణాన్ని బలహీనపరుస్తుందని కనుగొన్నారు.
గుండె రక్తాన్ని పంప్ చేయడాన్ని కష్టతరం చేసే కణజాలం ఏర్పడటానికీ టైప్-2 డయాబెటిస్ కారణం అవుతుందని గుర్తించారు. ఈఎంబీవో మాలిక్యులర్ మెడిసిన్ జర్నల్లో ఈ పరిశోధనా వివరాలను ప్రచురించారు. మధుమేహ బాధితుల్లో హృద్రోగ సమస్యలు, గుండె ఆగిపోయే ప్రమాదం ఎక్కువగా రావడానికి గల కారణాలను ఇందులో వివరించారు. గుండె వైఫల్యానికి ప్రధాన కారణమైన ఇస్కీమిక్ కార్డియోమయోపతి ఉన్న రోగులలో ఈ ప్రభావాలు ఎక్కువగా కనిపిస్తాయని పరిశోధకులు వెల్లడించారు.
గుండె జబ్బులు, టైప్-2 డయాబెటిస్ మధ్య పరస్పర సంబంధం ఉంటుందనే విషయం తెలిసిందే! అయితే, ఇంతకుముందు పరిశోధనల్లో ఎక్కువశాతం జంతువులపై చేసినవే! తాజాగా, సిడ్నీ విశ్వవిద్యాలయం పరిశోధకులు గుండె మార్పిడి చేయించుకున్నావారితోపాటు ఆరోగ్యకరమైన వ్యక్తుల గుండె కణజాలాన్నీ అధ్యయనం చేశారు. అధునాతన మైక్రోస్కోపీ పద్ధతులను ఉపయోగించి, గుండె కండరాలలో ప్రత్యక్ష మార్పులను కనుగొన్నారు. ఈ ప్రత్యక్ష పరీక్ష ద్వారా జంతు నమూనాలపై ఆధారపడకుండా, మానవ రోగులలో గుండె ఆరోగ్యంపై మధుమేహం ఎంతలా ప్రభావం చూపిస్తుందో గుర్తించడానికి వీలు కలుగుతుందని పరిశోధకులు పేర్కొన్నారు.