Shaheen Afridi : పాకిస్థాన్ స్పీడ్‌స్టర్ షాహీన్ ఆఫ్రిది(Shaheen Afridi) కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే ఓటమి చవిచూశాడు. న్యూజిలాండ్(Newzealand)తో జరిగిన తొలి టీ20లో సారథిగానే కాకుండా బౌలర్‌గానూ విఫలయమ్యాడు. వన్డేల్లో కంటే టీ20ల్లో మరింత ప్రమాదకరమైన ఈ పేసర్‌ను కివీస్ బ్యాటర్లు ఉతికారేశారు. దాంతో ఈ పేస్ గుర్రం ఒకే ఓవర్లో ఏకంగా 24 పరుగులు సమర్పించుకున్నాడు.
ఆఫ్రిది వేసిన రెండో ఓవర్లో న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్ ఫిన్ అలెన్(Finn Allen)విరుచుకుపడ్డాడు. వరుసగా 6,4,4,4, 6 బాది 24 రన్స్ పిండుకున్నాడు. అయితే.. ఆఖరి బంతికి పరుగులేమీ రాకపోవడంతో ఆఫ్రిది బతికిపోయానురా బాబు అని ఊపిరి పీల్చుకున్నాడు. అలెన్ వీరబాదుడతో ఈ స్పీడ్‌స్టర్ పొట్టి ఫార్మాట్లో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులతో చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు.
వన్డే ప్రపంచ కప్ అనంతరం టీ20 సారథిగా ఎంపికైన షాహీన్ ఆఫ్రిదికి తొలి సవాలే న్యూజిలాండ్ (Newzealand)తో ఎదురైంది. ఆక్లాండ్ వేదికగా జరిగిన తొలి టీ20లో పాక్ 46 పరుగుల తేడాతో ఓడిపోయింది. తొలుత ఆల్‌రౌండర్ డారిల్ మిచెల్ (61 : 27 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు ) ఊచకోతకు కెప్టెన్ కేన్ విలియమ్సన్(57 : 42 బంతుల్లో 9 ఫోర్లు) హాఫ్ సెంచరీ తోడవ్వడంతో కివీస్ 8 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది.
Finn Allen takes on Shaheen Afridi 🔥 https://t.co/t54MxSG2xO | #NZvPAK pic.twitter.com/CUYmpLwBue
— ESPNcricinfo (@ESPNcricinfo) January 12, 2024
తద్వారా పాకిస్థాన్‌పై టీ20ల్లో అత్యధిక స్కోర్ నమోదు చేసింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో సౌథీ, సోధీ దెబ్బకు పాక్ మిడిలార్డర్ తడబడింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా మాజీ కెప్టెన్ బాబర్ ఆజాం(57) ఒంటరి పోరాటం చేశాడు. కానీ.. సౌథీ 18వ ఓవర్లో అబ్బాస్ అఫ్రిది(1), హ్యారిస్ రౌఫ్(0)లను ఔట్ చేయడంతో 180 పరుగుల వద్ద పాక్ ఇన్నింగ్స్ ముగిసింది.