Sean Williams | జింబాబ్వే స్టార్ ఆల్‌రౌండర్ సీన్ విలియమ్స్ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. అయితే, టీ20 వరల్డ్ కప్‌కు ముందు ఆల్ రౌండర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఈ నిర్ణయం ఆ జట్టుకు పెద్ద షాకింగ్ వార్తే. జూన్ 2న టీ20 ప్రపంచకప్ వెస్టిండీస్, అమెరికా వేదికగా జరుగనున్న విషయం తెలిసిందే. బంగ్లాదేశ్ గడ్డపై ఆతిథ్య జట్టుతో జరిగిన ఐదు మ్యాచుల టీ20 సిరీస్ ముగిసిన అనంతరం తన నిర్ణయాన్ని విలియమ్స్ ప్రకటించాడు. విలియమ్స్ బ్యాట్‌తో పాటు బంతితోనూ మ్యాజిక్ చేశాడు.
విలియమ్స్ టీ20 అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ కావాలని నిర్ణయించుకున్నాడని.. మ్యాచ్ తర్వాత నిర్ణయాన్ని సహచరులకు తెలియజేశాడని జింబాబ్వే అధికారి ఒకరు తెలిపారు. 2006లో బంగ్లాదేశ్‌పై టీ20లో అరంగేట్రం చేసిన విలియమ్స్.. అదే జట్టుతో చివరి మ్యాచ్‌ను ఆడాడు. అంతర్జాతీయ టీ20ల్లో 81 మ్యాచ్‌ల్లో 23.48 సగటుతో 1691 పరుగులు చేశాడు. ఇక 6.93 ఎకానమీ రేటుతో 48 వికెట్లు పడగొట్టాడు. విలియమ్స్ వన్డేలు, టెస్టుల్లో కొనసాగనున్నాడు. ఇక బంగ్లాదేశ్‌తో జరిగిన ఐదుమ్యాచుల టీ20 సిరీస్‌లో తొలి నాలుగు మ్యాచుల్లో బంగ్లాదేశ్ విజయం సాధించింది. చివరి మ్యాచ్‌లో జింబావ్వే గెలుపొందింది.