బార్బడోస్: డిఫెండింగ్ చాంపియన్ హోదాలో టీ20 వరల్డ్ కప్ బరిలో నిలిచి బోణీ కొట్టాలనుకున్న ఇంగ్లండ్ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. పలుమార్లు వర్షం అంతరాయం కలిగించడంతో 10 ఓవర్లకు కుదించిన మ్యాచ్లో స్కాట్లాండ్ దంచికొట్టింది. ఓపెనర్లు జార్జ్ మున్సె (31 బంతుల్లో 41 నాటౌట్, 4 ఫోర్లు, 2 సిక్సర్లు), మైఖెల్ జోన్స్ (30 బంతుల్లో 45 నాటౌట్, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) వేగంగా ఆడటంతో ఆ జట్టు 10 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 90 పరుగులు చేసింది. మార్క్ వుడ్, ఆర్చర్, మోయిన్ అలీ, క్రిస్ జోర్డాన్, అదిల్ రషీద్ వంటి అనుభవజ్ఞులైన బౌలర్లు ఉన్న ఇంగ్లండ్.. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయింది.
టాస్ తర్వాత వర్షం కురవడంతో మ్యాచ్ సుమారు గంట సేపు ఆలస్యంగా ఆరంభమైంది. ఆ తర్వాత ఆట మొదలైనా 6.2 ఓవర్ల వద్ద వరుణుడు మరోసారి అంతరాయం కలిగించాడు. దాదాపు రెండు గంటల తర్వాత ఆట ప్రారంభమైనా అంపైర్లు మ్యాచ్ను 10 ఓవర్లకు కుదించారు. ఇంగ్లండ్ లక్ష్యం 10 ఓవర్లలో 109 గా నిర్ణయించగా వర్షం మరోసారి కురువడంతో అంపైర్లు ఆటను రద్దు చేశారు. దీంతో ఇరు జట్లకు చెరొక పాయింట్ దక్కింది.