సింగపూర్: సుమారు మూడు నెలల విరామం తర్వాత బ్యాడ్మింటన్ కోర్టులోకి దిగిన భారత డబుల్స్ వీరులు సాత్విక్‌సాయిరాజ్-చిరాగ్ శెట్టి తమ పునరాగమనాన్ని విజయంతో ఆరంభించారు. సింగపూర్ ఓపెన్ సూపర్ 750 టోర్నీలో భాగంగా బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి మ్యాచ్‌లో సాత్విక్-చిరాగ్ జోడీ 21-16, 21-13తో చూంగ్ హాన్-మహ్మద్ హైకల్పై అలవోక విజయం సాధించింది.
ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన భారత జంట.. 40 నిమిషాల్లోనే ప్రత్యర్థిని చిత్తు చేసి ప్రిక్వార్టర్స్‌కు అర్హత సాధించింది. సాత్విక్-చిరాగ్ మెరిసినా మిగిలిన షట్లర్లకు నిరాశ తప్పలేదు. పురుషుల సింగిల్స్‌లో భారత నంబర్‌వన్ షట్లర్ లక్ష్యసేన్ 21-15, 17-21, 5-13తో లిన్ చున్ యి (చైనీస్ తైఫీ) చేతిలో ఓడిపోయాడు. మూడో గేమ్‌లో లక్ష్యసేన్‌కు వెన్ను నొప్పి బాధించడంతో అతడు రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. దీంతో ఆ గేమ్ పూర్తికాకుండానే లిన్ విజేతగా నిలిచాడు. మహిళల సింగిల్స్‌లో ఆకర్షి కశ్యప్, అనుపమ ఉపాధ్యాయ మొదటి రౌండ్‌కే ఇంటిబాట పట్టగా మహిళల డబుల్స్ ద్వయం వైష్ణవి-అలిషా సైతం నిరాశపరిచారు.