BWF World Championships : ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్‌లో సాత్విక్ సాయిరాజ్ (Satwik Sairaj) – చిరాగ్ శెట్టి (Chirag Shetty) ద్వయం రెండో పతకంతో మెరిసింది. మూడేళ్ల క్రితం ఈ టోర్నీలో కంచు (Bronze) మోత మోగించిన ఈ ద్వయం ఈసారి కూడా అదే మెడల్‌తో మురిసిపోయింది. ఆదివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో చైనా షట్లర్ల చేతిలో సాత్విక్ చిరాగ్ జోడీ పోరాడి ఓడింది. మూడు సెట్లలోనూ హోరాహోరీగా తలపడినప్పటికీ చెన్ బొ యాంగ్, లీ యూ జంట పైచేయి సాధించింది. దాంతో, మరోసారి కాంస్యంతోనే సరిపెట్టుకుందీ మాజీ నంబర్ వన్ జంట.
వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో అద్భుతంగా ఆడిన సాత్విక్ – చిరాగ్ ద్వయం ఫైనల్ చేరిన మొదటి భారత డబుల్స్ జంటగా చరిత్ర సృష్టించాలనుకుంది. కానీ, చైనా గోడను బద్ధలు కొట్టలేకపోయింది. 67 నిమిషాల పాటు ఉత్కంఠ రేపిన పోరులో తొలి సెట్‌ను చైనా జోడీ చెన్ బొ యాంగ్ లీయూ 21-19తో గెలుపొందింది. అయితే.. రెండో సెట్లో సాత్విక్ – చిరాగ్ పుంజుకొని 21-18తో ప్రత్యర్ధికి షాకిచ్చారు. నిర్ణయాత్మక మూడో సెట్లో భారత స్టార్లు తడబడ్డారు. చైనా జంటను నిలువరించలేక 12-21తో సెట్‌తో పాటు చరిత్ర లిఖించే అవకాశాన్ని చేజార్చుకున్నారు.
Is Satwik-Chirag’s bronze a band-aid after avenging their Olympic exit? 👀
“While these two and India’s badminton community deserves to celebrate a hard-won medal, there is a lot of backroom thinking to do on Plans B and more,” writes @ZENIADCUNHA ✍️ 🏸 pic.twitter.com/oc1bpjdKqM
— ESPN India (@ESPNIndia) August 31, 2025
‘మేము గొప్పగా ఆడలేకపోయాం. మ్యాచ్‌లో మాకు శుభారంభం లభించలేదు. మూడో గేమ్‌లో ప్రత్యర్థికి తేలికగా పాయింట్లు ఇచ్చాం. మేము మరింత స్మార్ట్‌గా ఆడి ఉండాల్సింది. కానీ, చైనా షట్లర్లు సూపర్‌గా ఆడారు. ఆట ఆరంభం నుంచి మూడో గేమ్ వరకూ వాళ్లు మాకంటే మెరుగ్గా సర్వ్ చేశారు. తొందరపడకుండా సర్వ్ చేయడం.. ప్రశాంతంగా ఉండడం.. ఇలా ఆటలో మేము కొన్ని మార్పులు చేసుకోవాల్సింది’ అని చిరాగ్ తమ ఓటమిపై స్పందించాడు.