హాంకాంగ్: హాంకాంగ్ బ్యాడ్మింటన్‌లో భారత షట్లర్లకు నిరాశే ఎదురైంది. గెలిచి టైటిళ్లతో మెరుస్తారనుకున్న సాత్విక్, చిరాగ్ జోడీతో పాటు లక్ష్యసేన్ రన్నరప్ టైటిళ్లతో సరిపెట్టుకున్నారు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్‌శెట్టి జోడీ 21-19, 14-21, 17-21తో చైనా ద్వయం లియాంగ్ వీ కెంగ్, వాంగ్ చాంగ్‌పై ఓటమిపాలైంది. గంట పాటు సాగిన తుదిపోరులో తొలి గేమ్ గెలిచిన సాత్విక్, చిరాగ్ జంటకు ఒలింపిక్ రజత విజేత చైనా షట్లర్లు అద్భుతంగా పుంజుకుని వరుసగా రెండుగేమ్లతో మ్యాచ్‌ను తమ వశం చేసుకున్నారు.
ముఖాముఖి పోరులో చైనా జోడీపై 7-6 ఆధిక్యంలో ఉన్న సాత్విక్, చిరాగ్ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయారు. మరోవైపు పురుషుల సింగిల్స్ ఫైనల్లో యువ షట్లర్ లక్ష్యసేన్ 15-21, 12-21తో ప్రపంచ నంబర్ ఫోర్ షట్లర్ లీ షీ షెంగ్ చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచాడు. తొలి గేమ్‌లో 4-0 ఆధిక్యం కనబరిచిన లక్ష్యసేన్ అదే దూకుడు కొనసాగించలేకపోయాడు. ఇదే అదనుగా లీ షెంగ్ కండ్లు చెదిరే స్మాష్‌లతో వరుస గేముల్లో సేన్‌ను చిత్తుచేశాడు.