టోక్యో: ప్రతిష్టాత్మక ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత యువ అథ్లెట్ సర్వేశ్ అనిల్కుశారె అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన పురుషుల హైజంప్ విభాగంలో ఫైనల్‌కు అర్హత సాధించాడు. ఈ ఫీట్ అందుకున్న తొలి భారత అథ్లెట్‌గా అనిల్ నిలిచాడు. అర్హత రౌండ్లో గ్రూపు-బీ నుంచి పోటీపడ్డ 30 ఏండ్ల కుశారె 2.25 మీటర్ల ఎత్తు దూకి సంయుక్తంగా ఏడో స్థానంలో నిలిచాడు. ఓవరాల్‌గా రెండు గ్రూపుల నుంచి అనిల్‌కు తొమ్మిదో స్థానం దక్కింది. మంగళవారం హైజంప్ ఫైనల్ జరుగనుంది.
ఇందులో 2.30 మీటర్ల క్వాలిఫయింగ్ మార్క్ లేదా 12 అత్యుత్తమ ప్రదర్శనలను పరిగణనలోకి తీసుకుంటారు. 2022లో కుశారె 2.27మీటర్లతో తన వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. మహారాష్ట్రలోని నాసిక్‌లోని సాధారణ రైతు కుటుంబానికి చెందిన అనిల్ చాలా కష్టపడి పైకి వచ్చాడు. పారిస్(2024) ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి భారత హైజంపర్గా నిలిచిన ఈ యువ అథ్లెట్ తాజాగా ప్రపంచ అథ్లెటిక్స్‌లోనూ సత్తాచాటుతున్నాడు. మరోవైపు పురుషుల 10వేల మీటర్ల రేసులో గుల్వీర్సింగ్ 16వ స్థానంలో నిలిచి నిరాశపరిచాడు.