IND vs ENG 2nd Test: గడిచిన మూడేండ్లుగా రంజీలలో పరుగుల వరద పారిస్తూ భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు ముంబై యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్. 2022 నుంచి జాతీయ జట్టులోకి రావడానికి ప్రయత్నిస్తున్న సర్ఫరాజ్‌కు ఎట్టకేలకు రెండో టెస్టులో జట్టులోకి ఎంపికైనా ఫైనల్ లెవన్‌లో మాత్రం చోటు దక్కలేదు. సర్ఫరాజ్ కంటే రజత్ పాటిదార్ వైపునకే భారత టీమ్ మేనేజ్మెంట్ మొగ్గు చూపింది. అయితే ఈ మ్యాచ్‌లో ఆడే అవకాశం రాకున్నా తనకు మాత్రం జాతీయ జట్టులోకి వచ్చినందుకు సంతోషంగా ఉందంటున్నాడు సర్ఫరాజ్ ఖాన్. జాతీయ జట్టుకు ఎంపికైన నేపథ్యంలో బీసీసీఐ టీవీతో అతడు తన భావోద్వేగ ప్రయాణాన్ని అభిమానులతో పంచుకున్నాడు.
స్వదేశంలో ఇంగ్లండ్‌తో రెండు టెస్టులకు మొదలు సర్ఫరాజ్ ఎంపికకాకపోయినా రెండో టెస్టుకు ముందు కెఎల్ రాహుల్, రవీంద్ర జడేజాలు గాయం కారణంగా దూరమవడంతో సెలక్టర్లు సర్ఫరాజ్‌ను ఎంపికచేశారు. అప్పటిదాకా ఇంగ్లండ్ లయన్స్‌తో మ్యాచ్‌లు ఆడుతున్న సర్ఫరాజ్ ఆగమేఘాల మీద వచ్చి రోహిత్ సేనతో కలిశాడు. జాతీయ జట్టుకు ఎంపికైన నేపథ్యంలో సర్పరాజ్ మాట్లాడుతూ… ‘నేను రంజీ మ్యాచ్‌లు ఆడేందుకు నా బ్యాగులు సర్దుకుంటున్నా. సడెన్ గా నాకు ఫోన్ వచ్చింది. నేను నేషనల్ టీమ్‌కు సెలక్ట్ అయ్యాననేది దాని సారాంశం. మొదట్లో నేను అస్సలు నమ్మేలేదు. మా నాన్న యూపీలోని మా సొంతూళ్లో ఉన్నాడు. నేను జాతీయ జట్టుకు ఎంపికయ్యానని తెలిసిన వెంటనే నాన్నకు ఫోన్ చేసి చెప్పాను. మేమిద్దరం చాలా ఎమోషనల్ అయ్యాం..
ఇప్పటిదాకా నాకు మా నాన్నే కోచ్ అన్న సంగతి అందరికీ తెలుసు. నాకున్న ఏకైక కల ఆయన ఆశయాన్ని నెరవేర్చడం. నేను భారత జట్టు తరఫున ఆడాలన్నది ఆయన కల. టీమిండియా నుంచి పిలుపు రాగానే నేను చాలా హ్యాపీగా ఫీలయ్యా. ఇన్నాళ్లకు నా శ్రమకు తగిన ఫలితం దక్కిందని భావించా..’అని అన్నాడు.
తాను జాతీయ జట్టుకు ఎంపికైన వెంటనే ఇండియా ఎ జట్టులో తనతో ఉన్న సహచర ఆటగాళ్లంతా తనను అభినందించారని చెప్పిన సర్ఫరాజ్.. ఇప్పటివరకూ జరిగిందేదైనా మంచికేనని, దాని గురించి ఇప్పుడాలిచించాల్సిన అవసరం లేదని అన్నాడు. భారత జట్టు తరఫున ఆడే అవకాశం వచ్చిన రోజు తన కల నెరవేరినట్టేనని సర్ఫరాజ్ భావోద్వేగంతో వ్యాఖ్యానించాడు. ఈ వీడియోను బీసీసీఐ తన సోషల్ మీడియా ఖాతాలలో షేర్ చేసింది.
అయితే సర్ఫరాజ్ ఖాన్ జాతీయ జట్టులోకి వచ్చినా తుది జట్టులో మాత్రం అతడికి చోటు దక్కలేదు. సర్ఫరాజ్ ఖాన్‌ను బెంచ్‌కే పరిమితం చేసిన టీమ్ మేనేజ్మెంట్.. పాటిదార్‌కు అవకాశమివ్వడంతో సోషల్ మీడియా వేదికగా అతడి మద్దతుదారులు బీసీసీఐపై దుమ్మెత్తిపోస్తున్నారు.