పారిస్: భారత రెజ్లర్ వినేశ్ ఫోగట్ అధిక బరువు వల్ల పారిస్ ఒలింపిక్స్ 50 కేజీల రెజ్లింగ్ ఫైనల్లో డిస్క్వాలిఫై అయిన విషయం తెలిసిందే. అయితే ఫైనల్లో ఆడాల్సిన అమెరికా రెజ్లర్ సారా ఆన్ హిల్డెబ్రాండ్(Sarah Ann Hildebrandt) కు .. గోల్డ్ మెడల్‌ను అందజేశారు. వాస్తవానికి ఫైనల్లో భారత స్టార్ రెజ్లర్‌ను ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉన్నానని, కానీ ఆ రోజు ఉదయం అనుకోని పరిణామాలు చోటుచేసుకున్నట్లు ఆమె చెప్పారు. వినేశ్‌పై అనర్హత వేటు వేయడంతో.. ఫైనల్లో ఆమె స్థానంలో క్యూబా రెజ్లర్ యుసునెలిస్ గుజ్మెన్ లోపేజ్ ఆడింది. సెమీస్‌లో లోపేజ్‌ను వినేశ్ ఓడించిన విషయం తెలిసిందే.
ఫైనల్ కోసం ప్రిపేరయ్యానని, కానీ మ్యాచ్‌కు ముందు జరిగిన పరిణామాలు పెద్దగాతెలియదని హిల్డెబ్రాండ్ తెలిపారు. 30 ఏళ్ల ఆ రెజ్లర్.. టోక్యో గేమ్స్‌లో బ్రాంజ్ మెడల్ గెలిచింది. అయితే వెయిట్ చెకింగ్ సమయంలో వినేశ్‌ను గుర్తించలేదని ఆమె అన్నారు. బహుశా భారత రెజ్లర్ తప్పుకుని ఉంటుందని అనుకున్నట్లు ఆమె చెప్పింది. ఓ మై గాడ్, ఇలాంటిది ఏమైనా జరిగి ఉంటుందా అని అనుకున్నట్లు ఆమె తెలిపింది. అయితే ఆ తర్వాత తమకు న్యూస్ అందిందని, వెయిట్ చెకింగ్‌లో వినేశ్ విఫలమైనట్లు తెలిసిందని హిల్డెబ్రాండ్ పేర్కొన్నది. ఆ సమయంలో ఆమె తప్పుకోనున్నట్లు తమకు అర్థమైనట్లు వెల్లడించింది. వినేశ్ ఆడదని తెలిసిన తర్వాత తాము సెలబ్రేషన్లో మునిగినట్లు చెప్పింది.
రాత్రికి రాత్రి వెయిట్ తగ్గేందుకు వినేశ్ చాలా ప్రయత్నాలు చేసింది. కానీ వంద గ్రాముల అధిక బరువు వల్ల ఆమె ఫైనల్ ఆడలేకపోయింది. 50 కేజీ రెజ్లింగ్ ఫ్రీ స్టయిల్ విన్నర్ హిల్డెబ్రాండ్ కూడా 55 కేజీల కేటగిరీ నుంచి 50 కేజీల కేటగిరీకి వచ్చింది. కానీ ఆమె రెండేళ్ల నుంచి ఆ ప్రయత్నం చేసింది. వెయిట్ కట్ కోసం చాలా క్రమశిక్షణ పాఠించాల్సి వచ్చినట్లు హిల్డెబ్రాండ్ తెలిపింది. పారిస్ గేమ్స్ కోసం 2022 నుంచే వెయిట్ కట్ పద్ధతులు అమలు చేసినట్లు వెల్లడించింది. కఠినంగా బరువు నియంత్రణ పద్ధతులు పాటించడం వల్లే పారిస్ ఒలింపిక్స్‌కు రాగలిగినట్లు ఆమె చెప్పింది.