Sania Mirza : భారత టెన్నిస్ దిగ్గజం సానియా మిర్జా (Sania Mirza) మళ్లీ రాకెట్ పట్టింది. రెండేళ్ల క్రితం వీడ్కోలు పలికిన సానియా.. కుమారుడు ఇజాన్ (Izhaan Mirza) కోసం కోచ్ అవతారమెత్తింది. తన కొడుకును టెన్నిస్ సంచలనంగా మార్చేందుకు స్వయంగా శిక్షణ ఇస్తోంది లెజెండరీ ప్లేయర్. తాజాగా సానియా, ఇజాన్ టెన్నిస్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను ఆమె తల్లి నసీమా మిర్జా (Nasima Mirza) సోమవారం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. మనదేశంలో మహిళల టెన్నిస్‌కు ఎనలేని గుర్తింపు తీసుకొచ్చిన సానియా.. తన బిడ్డకు మెలకువలు నేర్పిస్తున్న వీడియో నెట్టింట వైరలవుతోంది.
కూతురు, మనవడు టెన్నిస్ ఆడుతున్న వీడియో పంచుకున్న నసీమా చాలా సంతోషం వ్యక్తం చేసింది. తల్లీబిడ్డ ఇద్దరూ ఒకేరకమైన ప్యాషన్‌తో టెన్నిస్ ఆడుతున్నారని ఆమె పొంగిపోయింది. ‘చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. కూతురు, మనవడు ఒకే ఆట ఆడడం చూస్తుంటే మనసు ఉప్పొంగుతోంది. ఇద్దరూ ఎంతో ఇష్టంగా టెన్నిస్ ఆడుతున్న తీరు అద్భుతం’ అని నసిమా తన పోస్ట్‌కు క్యాప్షన్ రాసింది. కోర్టులో వేగంగా కదలండ.. ఫోర్‌హ్యాండ్, బ్యాక్‌హ్యాండ్ షాట్లు ఆడడంలో శిక్షణ ఇస్తోంది. దిగ్గజ ప్లేయర్ అయిన తల్లి స్ఫూర్తితో టెన్నిస్‌లో అద్భుతాలు చేసేందుకు సిద్ధమవున్నాడు ఇజాన్.
టెన్నిస్ క్రీడాకారిణిగా ఎన్నో ఘనతలు సాధించిన సానియా మిర్జా వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంది. నిరుడు భర్త షోయబ్ మాలిక్ నుంచి విడాకులతో మానసికంగా కుంగిపోయిన సానియా.. తనకు నచ్చిన పనుల్లో నిమగ్నమై మామూలు స్థితికి వచ్చింది. జీవితంలో సంతోషాన్నిచ్చే పనులపై దృష్టి పెట్టిన ఆమె.. తన కుమారుడు ఇజాన్‌ను టెన్నిస్ స్టార్‌ను చేయాలనుకుంటోంది. అందుకని.. చిన్న వయసు నుంచే అతడికి ట్రైనింగ్ ఇవ్వడం మొదలెట్టింది.
రెండేళ్ల క్రితం ఆస్ట్రేలియా ఓపెన్ తర్వాత టెన్నిస్‌కు వీడ్కోలు పలికింది సానియా. 2005లో డబ్ల్యూటీఏ టైటిల్ విజేతగా చరిత్ర సృష్టించిన సానియా భారత టెన్నిస్‌లో తన ముద్ర వేసింది. 2007లో టాప్ -30లోకి దూసుకెళ్లిన తను.. కెరీర్లో అత్యుత్తమంగా 27వ ర్యాంక్ సాధించింది. డబుల్స్‌లో మూడు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు (2015లో యూఎస్ ఓపెన్, 2015లో వింబుల్డన్, 2016లో యూఎస్ ఓపెన్) గెలుపొందిన సానియా.. మిక్స్డ్ డబుల్స్‌లో మూడుసార్లు ఛాంపియన్‌గా నిలిచింది. 2023 ఫిబ్రవరిలో టెన్నిస్‌కు అల్విదా చెప్పేసింది సానియా.