Sania Mirza : భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మిర్జా వచ్చే ఏడాది తొలి గ్రాండ్‌స్లామ్ ఆడనుంది. ఏడాదికాలం విరామం తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆమె బరిలోకి దిగనుంది. డబుల్స్ విభాగంలో ఆమె కజకిస్థాన్‌కు చెందిన అన్నా డానిలినాతో జోడీ కట్టనుంది. ప్రస్తుతం 24వ ర్యాంకులో ఉన్న సానియా, 11వ ర్యాంకర్ అయిన అన్నాతో కలిసి ఆడనుంది. 2023 జనవరి 16 నుంచి ఆస్ట్రేలియన్ ఓపెన్ మొదలుకానుంది. అయితే.. ఆమె మిక్స్డ్ డబుల్స్‌లో ఆడనుందా? లేదా? అనేది మాత్రం తెలియదు. సానియా 2016లో ఆస్ట్రేలియన్ ఓపెన్ డబుల్స్ టైటిల్ నెగ్గింది. స్విట్జర్లాండ్ స్టార్ క్రీడాకారిణి మార్టినా హింగిస్‌తో కలిసి టైటిల్ అందుకుంది. మిక్స్డ్ డబుల్స్‌లో భారత స్టార్ లియాండర్ పేస్‌తో కలిసి సానియా 2009లో ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా నిలిచింది.
పోయిన ఏడాది ముంజేతికి గాయం కారణంగా సానియా యూఎస్ ఓపెన్ నుంచి తప్పుకుంది. ప్రస్తుతం సానియా దుబాయ్‌లో జరగుతున్న వరల్డ్ టెన్నిస్ లీగ్‌లో ఆడుతోంది. ఒకప్పుడు మహిళల డబుల్స్‌లో నంబర్ 1 ప్లేస్‌లో ఉన్న సానియా ఆరుసార్లు సెమీఫైనల్స్ ఆడింది. రెండు సార్లు ఫైనల్లో అడుగుపెట్టింది. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను పెళ్లి చేసుకున్న సానియా ఈమధ్య విడాకుల విషయంలో వార్తల్లో నిలిచింది. అయితే.. తాము విడిపోతున్నట్టు మాలిక్ – సానియా బహిరంగంగా ప్రకటించలేదు. వీళ్లిద్దరూ ఈ మధ్యే ది మీర్జా మాలిక్ అనే టాక్‌షోలో కలిసి నటించారు.