భారత టెన్నిస్ క్వీన్ సానియా మీర్జా కల చెదిరింది. రెండు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌ను చిరస్మరణీయ విజయంతో ముగిద్దామనుకున్న ఆమె ఆశ నెరవేరలేదు. తనకు బాగా అచ్చొచ్చిన ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో హైదరాబాదీ సానియా రన్నరప్‌గా నిలిచింది. శుక్రవారం ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన మిక్స్డ్ డబుల్స్ ఫైనల్స్‌లో సానియా, రోహన్ బోపన్న జోడీ..బ్రెజిల్ ద్వయం చేతిలో ఓటమిపాలైంది. ఎక్కడైతే గ్రాండ్‌స్లామ్ కెరీర్ మొదలుపెట్టిందో అక్కడే తన ప్రస్థానాన్ని ముగించింది. ఉబికి వస్తున్న కన్నీటి అదిమిపట్టుకుంటూ ఇన్నేండ్ల కెరీర్లో తన గత స్మృతులను గుర్తుకు తెచ్చుకుంది. రాడ్లీవర్ ఎరీనాతో తనకున్న ప్రేమను చాటుకుంటూ ఇక సెలవు అంటూ కుటుంబసభ్యులు, అభిమానుల కరతాళ ధ్వనుల మధ్య బై బై చెప్పింది. మొత్తంగా ప్రపంచ టెన్నిస్ చరిత్రలో భారత ఖ్యాతిని దశదిశలా వ్యాప్తి చేసిన సానియా గ్రాండ్‌స్లామ్ ప్రస్థానం ముగిసింది.
మెల్బోర్న్: భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా తన గ్రాండ్‌స్లామ్ కెరీర్‌కు వీడ్కోలు పలికింది. ప్రొఫెషనల్ కెరీర్ అరంగేట్రం చేసిన ఆస్ట్రేలియన్ ఓపెన్లోనే తన ప్రాణ స్నేహితుడు రోహన్ బోపన్నతో కలిసి ఆఖరి ఆట ఆడేసింది. శుక్రవారం రాడ్లీవర్ ఎరీనాలో జరిగిన మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో భారత ద్వయం సానియా మీర్జా, రోహన్ బోపన్న 6-7(2/7), 2-6 తేడాతో బ్రెజిల్ జోడీ లూయిసా స్టెఫానీ, రఫెల్ మటోస్ చేతిలో ఓడింది. మ్యాచ్ విషయానికొస్తే..తొలి సెట్లో 0-2తో వెనుకంజలో ఉన్నా అద్భుతంగా పుంజుకున్న భారత జంట ప్రత్యర్థికి దీటైన పోటీనిచ్చే ప్రయత్నం చేసింది. కండ్లు చెదిరే ఫోర్‌హ్యాండ్, బ్యాక్‌హ్యాండ్ షాట్లతో 5-3తో ఆధిక్యం దక్కించుకున్నారు. సర్వీస్‌ల విషయంలో బోపన్న తడబడటం బ్రెజిల్ జోడీకి కలిసి వచ్చింది. దీన్ని తమకు అనుకూలంగా మలుచుకున్న బ్రెజిల్ ద్వయం 12వ గేమ్‌లో సెట్ పాయింట్ కాపాడుకుంటూ టైబ్రేక్‌లో సెట్ దక్కించుకున్నారు. అదే జోరు కనబరుస్తూ రెండో సెట్‌ను ప్రత్యర్థి ద్వయం కైవసం చేసుకుంది. దీంతో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మరో టైటిల్ గెలుద్దామనుకున్న 36 ఏండ్ల సానియా ఆశలు నెరవేరలేదు.
‘కుటుంబ సభ్యులు, అభిమానుల సమక్షంలో ఆడటం నాకు మరిచిపోలేని అనుభూతి. సుదీర్ఘ గ్రాండ్‌స్లామ్ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతున్నాను. నేను ఇంకా మరికొన్ని టోర్నీలు ఆడాల్సి ఉంది. రోహన్ బోపన్న నాకు తొలి మిక్స్డ్ డబుల్స్ భాగస్వామి. నేను 14 ఏండ్ల వయసులో తొలిసారి బోపన్నతో కలిసి జాతీయ టోర్నీ గెలిచాను. అది జరిగి ఇప్పటికీ 22 ఏండ్లు అవుతుంది. బోపన్న కంటే ప్రాణ స్నేహితున్ని ఊహించుకోలేను. అతను నా ఆప్తమిత్రుడు, గొప్ప భాగస్వామి. నా ప్రొఫెషనల్ కెరీర్ మెల్‌బోర్న్‌లోనే మొదలైంది. నాకు 18 ఏండ్లు ఉన్నప్పుడు సింగిల్స్ మూడో రౌండ్లో సెరెనా విలియమ్స్‌తో పోటీపడ్డాను. ఈ 18 ఏండ్లలో ఇక్కడి చాలాసార్లు వచ్చాను. కొన్ని టైటిళ్లు గెలిచాను, మరికొన్ని గొప్ప ఫైనల్స్ ఆడాను. రాడ్లీవర్ ఎరీనా నాకు ఎంతో ప్రత్యేకం. నా గ్రాండ్‌స్లామ్ కెరీర్‌కు వీడ్కోలు పలికేందుకు ఇంతకన్నా గొప్ప వేదిక ఉందనుకోను. నా కొడుకు ఇజాన్ ముందు గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడుతానని ఎప్పుడూ ఊహించలేదు. నాలుగేండ్ల నా కొడుకు, తల్లిదండ్రులు, బంధువుల మధ్య ఆడటం మరింత ప్రత్యేకం’ అంటూ సానియా చెమర్చిన కండ్లతో మాట్లాడింది.