కరాచీ: లీగ్ దశలో వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిపోయి చాంపియన్స్ ట్రోఫీ నుంచి నిష్క్రమించిన ఆతిథ్య పాకిస్థాన్ క్రికెట్ జట్టుపై మాజీ క్రికెటర్లు విమర్శల దాడిని పెంచారు. ప్రస్తుతమున్న పాకిస్థాన్ క్రికెట్ జట్టును భారత దిగ్గజ సారథి మహేంద్ర సింగ్ ధోనీ కూడా మార్చలేడని పాక్ మహిళా జట్టు మాజీ సారథి సనా మిర్ అభిప్రాయపడింది. ఓ టీవీ షోలో ఆమె మాట్లాడుతూ ‘చాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపిక చేసిన 15 మంది సభ్యుల పాక్ టీమ్‌ను ధోనీ గానీ యూనిస్ ఖాన్ (మాజీ కెప్టెన్) గానీ మార్చలేరు. ఈ జట్టుతో ఎవరూ ఏమీ చేయలేరు. భారత్‌తో మ్యాచ్ జరుగుతున్నప్పుడు నాకు ఓ ఫ్రెండ్ ఫోన్ చేసి టీమ్ఇండియా స్కోరు 100/2గా ఉంది. మనం ఓడిపోయినట్టే అని చెప్పింది. అప్పుడు నేను.. ఈ జట్టును ప్రకటించినప్పుడే అంతా అయిపోయిందని చెప్పా’ అని వ్యాఖ్యానించింది.